స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ (Keerthy Suresh) తన అభిమాన క్రికెటర్ ఎవరో వెల్లడించింది. టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ (Mahendra Singh Dhoni) తన ఫేవరేట్ క్రికెటర్ అని ఆమె తెలిపింది. ధోనీ అంటే తనకు చిన్ననాటి నుంచే ఎంతో ఇష్టమని, ఆయనే తన జీవితంలో మొదటి క్రష్ (Crush) అని చెప్పుకొచ్చింది. “ధోనీ లాంటి వ్యక్తినే పెళ్లి చేసుకోవాలని చిన్నప్పటి నుంచి అనుకునేదాన్ని,” అంటూ ఆమె నవ్వుతూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కీర్తి సురేష్ ఇటీవల ప్రముఖ నటుడు జగపతి బాబు (Jagapathi Babu) హోస్ట్ చేస్తున్న ఓటీటీ టాక్ షో “జయమ్ము నిశ్చయమ్మురా”లో ముఖ్య అతిథిగా పాల్గొంది. ఈ ఎపిసోడ్‌లో ఆమె తన కెరీర్, కుటుంబం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇదే సందర్భంగా హోస్ట్ జగపతి బాబు, “మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు?” అని అడగగా, కీర్తి సురేష్ ఎటువంటి సందేహం లేకుండా “ధోనీ!” అని సమాధానం ఇచ్చింది.
గతంలో కూడా ఓ ఇంటరాక్టివ్ సెషన్‌లో అభిమాన క్రికెటర్ గురించి ఒక ఫ్యాన్ ప్రశ్నించగా, కీర్తి సురేష్ ధోనీ పేరును చెబుతూ ‘తమ్బి, నమ్మ 7 ఎల్లప్పుడూ!’ (తమ్ముడు, మన 7 ఎప్పుడూ!) అని పేర్కొంది. ధోనీ జెర్సీ నెంబర్ 7 అన్న సంగతి తెలిసిందే. ధోనీపై ఆమెకున్న అభిమానం, చిన్ననాటి క్రష్ గురించి చెప్పిన ఈ విషయాలు ప్రస్తుతం సినీ మరియు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.









