సిల్వర్ స్క్రీన్‌పై కొన్ని కాంబినేషన్లు చూడాలంటే నిజంగా అదృష్టం ఉండాలి. అలాంటి కాంబోపై రూమర్ వచ్చినా, చిన్న వార్త బయటకు వచ్చినా, అభిమానులు ఆ కలయిక నిజం కావాలని ప్రార్థించేస్తారు. అలాంటి మ్యాజిక్ ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అవుతోంది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో కలసి ‘స్పిరిట్’ అనే భారీ చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ క్రమంలో ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది – ఈ సినిమాలో ప్రభాస్ తండ్రి పాత్రలో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారట!
చిరంజీవి పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని, ఆ పాత్ర కోసం సందీప్ రెడ్డి వంగా స్వయంగా మెగాస్టార్‌ను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడన్న టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది.
పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న స్పిరిట్‌లో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. రూమర్ నిజమైతే, చిరంజీవి ఎలాంటి రోల్‌లో అలరిస్తాడన్న కుతూహలం అభిమానుల్లో పెరుగుతోంది.
ఇటీవల ‘కుబేర’ సినిమా సక్సెస్ మీట్‌లో పాల్గొన్న చిరంజీవి, నాగార్జున చేసిన ప్రయోగం తనకు చాలా నచ్చిందని, తానూ అలాంటి ప్రత్యేకమైన పాత్రల్లో కనిపించాలని కోరుకుంటున్నానని చెప్పడం కూడా ఇప్పుడు ఈ రూమర్‌కు బలం చేకూరుస్తోంది.
అదనంగా, ప్రభాస్ – చిరంజీవి మధ్య సుదీర్ఘ స్నేహం, ఒకే ఊరుకు చెందిన బంధం, అలాగే సందీప్ రెడ్డి వంగ మెగాస్టార్ అభిమాని కావడం… ఈ వార్తను మరింత హాట్ టాపిక్‌గా మార్చేశాయి..