‘బలగం’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు వేణు, దిల్ రాజు ప్రొడక్షన్‌లో రెండో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. తన సొంతంగా రాసుకున్న ‘ఎల్లమ్మ’ కథను దిల్ రాజుకు చెప్పి గ్రీన్ సిగ్నల్ కూడా తెచ్చుకున్నాడు. మొదట ఈ స్క్రిప్ట్‌ను హీరో నానికి వినిపించగా, ఆయనకూ బాగా నచ్చింది. అయితే ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా ఆ కాంబినేషన్ కుదరకపోయింది.
తర్వాత ఈ కథ హీరో నితిన్ దగ్గరకు వెళ్లి, అక్కడ వెంటనే అంగీకారం వచ్చింది. దిల్ రాజు కూడా ‘ఎల్లమ్మ’ టైటిల్‌ను ఫిక్స్ చేసి, నితిన్ హీరోగా సినిమా తెరకెక్కుతుందని అధికారికంగా ప్రకటించాడు. ‘తమ్ముడు’ రిలీజ్ అయిన తర్వాత షూటింగ్ మొదలు పెడతామని చెప్పిన దిల్ రాజు, హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ను ఎంపిక చేసినట్లు టాక్ వినిపించింది.
అయితే నితిన్ నటించిన ‘తమ్ముడు’ ఆశించిన స్థాయిలో పనిచేయకపోవడంతో, దాని ప్రభావం ‘ఎల్లమ్మ’పై కూడా పడిందనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ క్రమంలో నితిన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడని, అతని స్థానంలో శర్వానంద్‌ను హీరోగా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో జోరుగా చర్చ సాగుతోంది.
కమెడియన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వేణు, ‘బలగం’తో దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించాడు. భావోద్వేగాలతో నిండిన ఆ సినిమా అందర్నీ కదిలించగా, ‘ఎల్లమ్మ’ కథ కూడా అదే స్థాయిలో హృదయాన్ని తాకుతుందని టాక్. ఎవరితో చేసినా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. మరి వేణు రెండో సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.