తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ అధికారాలను హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అస్సెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ)కి బదలాయించింది. ఆర్డినెన్స్ అధికారాలను హైడ్రాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ కట్టడాలపై హైడ్రాకు అధికారాలు ఇస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో జీహెచ్ఎంసీ పరిధి మొత్తంలో అక్రమ కట్టడాలపై కొరడా ఝలిపించేందుకు హైడ్రాకు కల్పించింది.
జీహెచ్ఎంసీ చట్టం-1955లో ఇప్పటి వరకు 374, 374-ఎ సెక్షన్లు ఉన్నాయి. ఇప్పుడు సెక్షన్ 374-బి చేరుస్తూ ఆర్డినెన్స్ ద్వారా ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరించింది. అందులోని అంశాలకు సంబంధించి జీహెచ్ఎంసీ కమిషనర్‌కు సమకూరే అధికారాలను రాష్ట్ర ప్రభుత్వం ఏ ఇతర సంస్థకైనా అప్పగించవచ్చని ఆర్డినెన్స్ చెబుతోంది. ఈ ఆర్డినెన్స్ కు అనుగుణంగానే తాజాగా, ఆ అధికారాలను హైడ్రాకు బదలాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైడ్రాకు జీహెచ్ఎంసీ అధికారాలు కూడా వచ్చినట్లయింది.
హైడ్రాకు జీహెచ్ఎంసీ అధికారాలపై రంగనాథ్ ఏమన్నారంటే?
ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాకు జీహెచ్ఎంసీ చట్టంలోని అధికారాలను బదిలీ చేస్తూ మున్సిపల్ శాఖ బుధవారం జారీ చేసిన ఉత్తర్వులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. హైదరాబాద్ మహా నగరంలో అక్రమ నిర్మాణాలు, అనధికారిక కట్టడాలకు సంబంధించి హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందని తెలిపారు. అనధికారిక భవనాల కూల్చివేత అధికారం కూడా హైడ్రాకు లభించిందన్నారు.
జీహెచ్ఎంసీ చట్ట సవరణతో హైడ్రాకు పూర్తి స్థాయి అధికారాలు వచ్చాయని రంగనాథ్ తెలిపారు. ఇకపై ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం హైడ్రానే నోటీసులు జారీ చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే కూల్చివేతలు, స్వాధీనం సహా తదితర అధికారాలన్నీ హైడ్రాకు లభించాయని రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో హైడ్రా మరింత బలపడిందని చెప్పారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ చట్ట ప్రకారం, ఓఆర్ఆర్ పరిధిలోని 27 మున్సిపాలిటీలకు మున్సిపల్ చట్టం ప్రకారం హైడ్రా నడుచుకుంటుందని రంగనాథ్ తెలిపారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో అక్రమ నిర్మాణాలై హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశం ఉంది.
హైడ్రాకు హైకోర్టులో ఊరట
హైడ్రాకు హైకోర్టులో తాజాగా ఊరట లభించింది. జీవో 99, హైడ్రా చర్యలను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై బుధవారం హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా హైడ్రా ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. హైడ్రా ఏర్పాటును తప్పుపట్టలేమని పేర్కొంది.









