తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన ‘ఐబొమ్మ’ వెబ్సైట్ సృష్టికర్త రవి తండ్రి అప్పారావు, తాజాగా ఒక ఇంటర్వ్యూలో సినీ నిర్మాత సి. కళ్యాణ్‌పై మరియు పరిశ్రమలోని లోపాలపై తీవ్ర విమర్శలు చేశారు. తన కొడుకును ఉద్దేశించి “వాడిని కాల్చేయండి” అన్నారంటూ సి. కళ్యాణ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అప్పారావు, వందల కోట్లు మింగేయడానికి తన కొడుకు అడ్డు వచ్చాడనే వారికి అంత కోపం ఎందుకని ప్రశ్నించారు. ఈ సందర్భంగా, తాను ఒంటరిగా ఉన్న కొడుకు సంపాదించిన డబ్బు తనకు వద్దని, చట్టప్రకారమే చర్యలు ఉండాలని స్పష్టం చేశారు.
తన కొడుకు రవి ఈ మార్గాన్ని ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఆకలి, పేదరికమేనని అప్పారావు భావోద్వేగానికి లోనయ్యారు. ఇంట్లో సమస్యల వల్ల భార్యాభర్తలు విడిపోవడం, కొడుకు ఒంటరివాడై అన్నం లేక పస్తులుండటం వంటి చేదు జ్ఞాపకాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా, సినీ పరిశ్రమ పోకడలను ఆయన తప్పుబట్టారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు దేశం కోసం కష్టపడితే లక్షల్లో జీతం వస్తుంటే, కేవలం నటిస్తే హీరోలకు వందల కోట్లు ఎలా ఇస్తారని, ఇది నిర్మాతలలోని బుద్ధిలేని పని అని విమర్శించారు.
థియేటర్లలో తినుబండారాల ధరలు ఆకాశాన్ని అంటడంపై కూడా ఆయన మండిపడ్డారు. ఒక పేదవాడు సినిమాకు వెళ్లాలంటే రూ.1000 ఖర్చవుతుందని, ఆ డబ్బుతో నాలుగు రోజులు కూరగాయలు వస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తన కొడుకు ఉచితంగా సినిమాలు చూపిస్తున్నందుకు పేదవాడు సంతోషిస్తున్నాడని అన్నారు. అంతేకాక, తన భార్యది ‘క్రిమినల్ బ్రెయిన్’ అని, కొడుక్కి అవే జీన్స్ వచ్చాయని ఆరోపిస్తూ, తమ కుటుంబ కలహాలను కూడా బయటపెట్టారు.








