నటుడు శివాజీ తన తాజా చిత్రం ‘దండోరా’ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్ల గ్లామర్ ప్రదర్శనపై చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారితీశాయి. మహిళల అందం చీరకట్టులోనే ఉంటుందని, పొట్టి దుస్తులు ధరించడం వల్ల ఆ గౌరవం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. సావిత్రి, సౌందర్య వంటి మహానటులను ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తూనే, మితిమీరిన స్కిన్ షో చేసే హీరోయిన్లను బయటకు పొగిడినా లోపల జనం అసహ్యించుకుంటారని శివాజీ వ్యాఖ్యానించారు.
శివాజీ చేసిన ఈ వ్యాఖ్యలు మహిళల వ్యక్తిగత స్వేచ్ఛను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై ప్రముఖ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా స్పందించారు. “మా శరీరం మా ఇష్టం.. మాకు నచ్చిన దుస్తులు ధరించే స్వేచ్ఛ మాకుంది. మా శరీరం మాకు సొంతం, మీది కాదు” అని స్పష్టం చేస్తూ శివాజీకి పరోక్షంగా గట్టి హెచ్చరిక జారీ చేశారు.
ఈ వివాదంలో అనసూయతో పాటు గాయని చిన్మయి కూడా గొంతు కలిపారు. మహిళల దుస్తుల విషయంలో పురుషులు ఇలాంటి నీతులు చెప్పడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం నెట్టింట నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయి.. ఒకరు శివాజీ వ్యాఖ్యలను సమర్థిస్తుంటే, మరికొందరు అనసూయ చెప్పినట్లుగా అది వారి వ్యక్తిగత స్వేచ్ఛ అని వాదిస్తున్నారు. ఈ ‘బాడీ అటానమీ’ చర్చ ఇప్పుడు టాలీవుడ్లో చర్చనీయాంశంగా మారింది.








