సీరియల్ నటుడు ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ హీరోగా నటిస్తున్న ‘బరాబర్ ప్రేమిస్తా’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్లో ఆయన పాడిన ఒక పాట తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ పాటలో అసభ్య పదజాలం ఉందంటూ నెటిజన్లు, కొందరు జర్నలిస్టులు విమర్శలు గుప్పించగా.. చంద్రహాస్ దీనిపై ఘాటుగా స్పందించారు. తనపై ఇన్నేళ్లుగా జరుగుతున్న ట్రోలింగ్‌ను ప్రస్తావిస్తూ, అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు. ముఖ్యంగా తన కుటుంబ సభ్యులను, నిర్మాతలను కించపరిచేలా మాట్లాడిన ఓ జర్నలిస్టుకు 24 గంటల సమయం ఇస్తున్నానని, క్షమాపణ చెప్పకుంటే లీగల్ చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
తను స్టేజ్ మీద పాడిన పాట కేవలం సినిమా ప్రమోషన్స్ కోసం, బజ్ క్రియేట్ చేయడం కోసమే పాడానని చంద్రహాస్ స్పష్టం చేశారు. ఆ పాటలోని పదాలు సినిమాలో ఉండవని, కేవలం ‘నా జోలికి వస్తే పగిలిపోద్దిరా’ అనే ఉద్దేశంతోనే ఆ మాటలు అన్నానని వివరించారు. ఈ విషయంలో తాను ఎవరికీ క్షమాపణ చెప్పనని, తనను విమర్శించే వారు అంతకంటే దారుణమైన పదాలను వాడుతున్నారని మండిపడ్డారు. 19 ఏళ్ల వయసులో ఇండస్ట్రీకి వచ్చిన తనను అనవసరంగా టార్గెట్ చేస్తున్నారని, తన తల్లిదండ్రులను లాగడం పద్ధతి కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తాను సెట్స్‌లో అందరితో మర్యాదగా ఉంటానని, ఎక్కడా యాటిట్యూడ్ చూపించలేదని చంద్రహాస్ పేర్కొన్నారు. కేవలం మొదటి సినిమా ప్రమోషన్స్ సమయంలో తెలియక చేసిన కొన్ని చేష్టల వల్లే తనపై నెగెటివిటీ వచ్చిందని, కానీ అది ఇప్పుడు వ్యక్తిగత దూషణల వరకు వెళ్లడం సరికాదని అన్నారు. ఫిబ్రవరి 6న తన సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో కావాలనే కొందరు వివాదాన్ని పెద్దది చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ వివాదంతో సంబంధం లేకుండా ప్రేక్షకులు తన సినిమాను ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.









