పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్డేట్ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సినిమా టీజర్‌ను జూన్ 8 సాయంత్రం 6 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడిస్తూ ఓ పవర్ఫుల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
ప్రకటనతో పాటు విడుదలైన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విజయ్ సేతుపతి వెనక్కి తిరిగి నిలబడి, కళ్లకు నల్లటి గుడ్డ కట్టుకుని, చేతిలో రక్తంతో తడిసిన కత్తిని పట్టుకున్న లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. పోస్టర్లో కనిపిస్తున్న డార్క్ విజువల్స్, పొగలు కమ్ముకున్న బ్యాక్‌డ్రాప్, ఇంటెన్స్ మూడ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
‘రా స్ట్రీట్స్.. రియల్ స్కార్స్.. రూత్‌లెస్ ఎమోషన్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం మురికివాడల నేపథ్యంలో సాగే క్రైమ్ అండ్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. పూరీ జగన్నాథ్ తన పాత మాస్ స్టైల్‌ను మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారనే సంకేతాలు పోస్టర్లోనే కనిపిస్తున్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ చిత్రంలో విజయ్ సేతుపతికి జోడీగా సంయుక్తా మీనన్ నటిస్తుండగా, టబు, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే బ్రహ్మానందం, విటివి గణేష్ కూడా ఈ సినిమాలో భాగమవుతున్నట్లు సమాచారం. పూరీ కనెక్ట్స్, జెబి మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, జెబి నారాయణరావు కొండ్రొల్ల నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.
సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండటంతో యాక్షన్ సన్నివేశాలకు మరింత బలం చేకూరనుంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను కూడా టీజర్‌తో పాటు ప్రకటించే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇప్పటికే పోస్టర్‌తో హైప్ పెంచిన ‘స్లమ్ డాగ్ – 33 టెంపుల్ రోడ్’ టీమ్, జూన్ 8న విడుదలయ్యే టీజర్‌తో మరెన్ని సంచలనాలకు తెరతీస్తుందో చూడాలి.









