ప్రముఖ నటి సమంత (Samantha) ఇటీవల ప్రముఖ దర్శక-నిర్మాత రాజ్ నిడిమోరు (Raj Nidimoru)ను వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా వీరి డేటింగ్ గురించి వస్తున్న వార్తలకు తెరదించుతూ, కోయంబత్తూరులోని ఇషా ఆశ్రమంలో వీరి పెళ్లి వేడుక ఆధ్యాత్మిక వాతావరణంలో నిరాడంబరంగా జరిగింది. ఈ వివాహానికి అతికొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలోకి విడుదల కావడంతో సమంత పెళ్లి హడావుడి నెట్టింట వైరల్ అవుతోంది. ప్రత్యేకంగా, రాజ్ నిడిమోరు కుటుంబ సభ్యులతో కలిసి నూతన దంపతులు దిగిన ఒక ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోటోను రాజ్ సోదరి శీతల్ నిడిమోరు స్వయంగా తన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
శీతల్ నిడిమోరు ఈ సందర్భంగా భావోద్వేగంతో కూడిన పోస్ట్ చేశారు. ”నా ఆనందాన్ని వ్యక్తపరచడానికి మాటలు సరిపోవు. నేటితో మా కుటుంబం సంపూర్ణమైంది. సమంత–రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని కోరుకుంటున్నా. పరస్పర గౌరవం, నిజాయతీ ఉన్నప్పుడే వివాహ జీవితం అందంగా మారుతుంది. సమంతకు మేమంతా జీవితాంతం అండగా ఉంటాం” అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు సమంత కూడా ప్రేమతో ‘Love you’ అని రిప్లై ఇచ్చారు.









