2026 సంక్రాంతికి టాలీవుడ్లో పోటీ తీవ్రమవుతోంది. ఇప్పటికే అర డజనుకు పైగా క్రేజీ సినిమాలు విడుదల తేదీలను ప్రకటించగా, ఇప్పుడు శర్వానంద్ నటిస్తున్న ‘నారీ నారీ నడుమ మురారి’ కూడా పొంగల్ రేసులోకి వస్తున్నట్లు కనిపిస్తోంది. నిర్మాత అనిల్ సుంకర చేసిన ట్వీట్లు ఈ విషయంపై హింట్ ఇస్తున్నాయి. గతంలో శర్వానంద్ సంక్రాంతికి సాధించిన విజయాలను గుర్తుచేస్తూ ఆయన ట్వీట్లు చేశారు. 2016లో ‘ఎక్స్‌ప్రెస్ రాజా’, 2017లో ‘శతమానం భవతి’ చిత్రాలతో శర్వానంద్ సక్సెస్ అందుకున్నారు.
‘సామజవరగమన’ ఫేమ్ రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రూపొందుతోంది. సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నట్లు గతంలో అధికారిక పోస్టర్ ద్వారా ప్రకటించినా, ఆ తర్వాత చప్పుడు చేయకపోవడంతో సినిమా వాయిదా పడిందని భావించారు. అయితే, ”2016 సంక్రాంతి సినిమా ఫలితాలు ఎవరికైనా గుర్తున్నాయా? 2017 సంక్రాంతి సినిమాల సంగతేంటి?” అంటూ అనిల్ సుంకర ప్రశ్నించడంతో, శర్వానంద్ హ్యాట్రిక్ హిట్ కోసం మళ్లీ పండగ బరిలో దిగుతున్నారనే ఊహాగానాలు మొదలయ్యాయి.
ప్రస్తుతానికి ప్రభాస్ ‘ది రాజాసాబ్’, చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్ గారు’, రవితేజ, నవీన్ పోలిశెట్టి చిత్రాలతో పాటు విజయ్, శివ కార్తికేయన్ డబ్బింగ్ సినిమాలు కూడా సంక్రాంతికి కర్చీఫ్‌లు వేశాయి. గతంలో ఎప్పుడూ లేనంతగా ఇన్ని క్రేజీ సినిమాలు ఒకేసారి విడుదలవుతుండటంతో థియేటర్ల సర్దుబాటు పెద్ద సమస్యగా మారనుంది. ఈ టఫ్ కాంపిటీషన్లో ‘నారీ నారీ నడుమ మురారి’ విడుదల కావడం రిస్క్ అనే కామెంట్స్ వినిపిస్తున్నప్పటికీ, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారేమో అనే చర్చ జరుగుతోంది.









