ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలో ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇక దీనిపై ఇప్పటికే చంద్రబాబు దీపావళి పండుగ సందేశంతో పాటు దీపం పథకం 2.0గురించి చెప్పారు. రేపు దీపావళి కానుకగా చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నుండి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు సిద్ధం అయ్యారు.
సీఎం చంద్రబాబు శ్రీకాకుళం పర్యటన
సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం జిల్లా పర్యటన షెడ్యూల్ ను సీఎం క్యాంపు కార్యాలయం నేడు విడుదల చేసింది. ఆ వివరాల ప్రకారం నవంబర్ 1 వ తేదీ శుక్రవారం ఉదయం 10.00 గంటలకు సీఎం ఉండవల్లి లోని తన నివాసం నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. 11.25 గంటలకు ఆయన విమానంలో విశాఖపట్నంకి చేరుకుంటారు.
ఈదుపురంలో ఫ్రీ గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయనున్న చంద్రబాబు
అక్కడ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 12.35 గంటలకు ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడే గంట పాటు ముఖ్య నాయకులను సీఎం చంద్రబాబు కలుసుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం 1.30 గంటలకు హెలిప్యాడ్ వద్ద నుంచి బయలుదేరి 1.50 నిమిషాల వరకు ఈదుపురంలో పలువురు లబ్ధిదారులకి దీపం పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లను అందజేస్తారు.
ప్రజలతో నేరుగా మాట్లాడనున్న చంద్రబాబు
మధ్యాహ్నం 2.20 గంటల వరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పలువురు లబ్ధిదారులకు స్వయంగా సీఎం చంద్రబాబు అందజేస్తారు.
అనంతరం మధ్యాహ్నం 2.20 నుంచి 3.20 గంటల వరకు గ్రామంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశం అవుతారు. గంటసేపు వారితో మాట్లాడిన అనంతరం తిరిగి ప్రయాణమై హెలికాప్టర్లో 4.00 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటారు.
రాత్రి జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష
శ్రీకాకుళం ఆర్ అండ్ బి అతిథి గృహంలో 6.30 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ఆ తర్వాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో రాత్రి 8.30 గంటల వరకు జిల్లా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సమీక్ష అనంతరం ఆర్ అండ్ బి అతిథి గృహంలో బస చేస్తారు. తర్వాత రోజు శనివారం విజయనగరం బయలుదేరి వెళ్తారు.









