తెలుగు చిత్ర పరిశ్రమలో వరుసగా తొమ్మిది విజయాలను అందుకుని ‘సక్సెస్ ఫుల్ డైరెక్టర్’గా గుర్తింపు పొందిన అనిల్ రావిపూడి, తన వ్యక్తిత్వంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వరుస హిట్లు వచ్చినప్పటికీ తనలో ఏమాత్రం గర్వం లేదని, భవిష్యత్తులో 99 హిట్లు కొట్టినా తాను ఇలాగే సాదాసీదాగా ఉంటానని స్పష్టం చేశారు. తాను ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చానని, ఆ నేపథ్యమే తనకు జీవితంపై, మనుషులపై సరైన అవగాహన కల్పించిందని ఆయన పేర్కొన్నారు.
సినిమా రంగంలో ఎంతటి ఉన్నత స్థాయికి చేరుకున్నా, మనిషిని మనిషిలా గౌరవించడమే అసలైన విజయమని అనిల్ రావిపూడి అభిప్రాయపడ్డారు. రోడ్డుపై తెలిసిన వారు కనిపిస్తే కారు దిగి పలకరించడం, వారితో టీ తాగడం వంటివి తనకు సహజమని, తన మూలాలను తాను ఎప్పుడూ మర్చిపోనని తెలిపారు. విజయాల జోరులో ఉన్నా నేల విడిచి సాము చేయకూడదనేది తన జీవన సూత్రమని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.
అనిల్ రావిపూడిలోని ఈ జోవియల్ స్వభావం మరియు ఆత్మీయత ఇండస్ట్రీలోని పలువురు స్టార్లను సైతం ఆకట్టుకుంది. ముఖ్యంగా అగ్ర కథానాయిక నయనతార వంటి వారు కూడా ఆయన వ్యక్తిత్వాన్ని ప్రశంసించినట్లు అనిల్ పేర్కొన్నారు. సెట్స్‌లో ఉండే సందడి, నటీనటులతో ఆయన మెలిగే తీరు ఆయన విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని సినీ వర్గాలు భావిస్తుంటాయి. మొత్తానికి ఎన్ని సక్సెస్ లు వచ్చినా తన పాత రోజులను గుర్చుకుంటూ సాదాసీదాగా ఉండటమే ఆయన ప్రత్యేకత.








