మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న మాస్ రూరల్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ బిజినెస్‌లో రికార్డు సృష్టించింది. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇంకా షూటింగ్ దశలో ఉండగానే ప్రముఖ స్ట్రీమింగ్ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సుమారు రూ.130 కోట్ల భారీ మొత్తానికి అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను కైవసం చేసుకున్నట్టు సమాచారం. ఈ స్థాయి డీల్ రామ్ చరణ్ పాన్-ఇండియా మార్కెట్‌ను, ‘పెద్ది’ సినిమా మీద ఉన్న అంచనాలను స్పష్టంగా చూపిస్తోంది.
‘పెద్ది’ సినిమాపై అంచనాలు భారీగా ఉండటానికి ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేసిన ‘చికిరి చికిరి’ సాంగ్ ప్రధాన కారణంగా నిలిచింది. మాస్ బీట్, రా ఎనర్జీ, చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలగలిపి విడుదలైన అతి తక్కువ సమయంలోనే ఈ ట్రాక్ 100 మిలియన్ల వ్యూస్‌ను దాటి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఈ పాట దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో, రామ్ చరణ్ మాస్ మార్కెట్ ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది. దీంతో ‘పెద్ది’కి బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి ఓపెనింగ్స్ వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ యాక్షన్ బ్లాక్ చిత్రీకరణ హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేక భారీ సెట్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ ఉత్కంఠభరిత పోరాట సన్నివేశంలో రామ్ చరణ్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కలిసి నటిస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రం 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.









