సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న అడ్వెంచరస్ థ్రిల్లర్ ‘వారణాసి’లో మహేష్ బాబు శ్రీరామచంద్రునిగా కనిపిస్తారనే వార్త అధికారికంగా ధృవీకరించబడింది. ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పాత్ర కోసం తాను ఎంతో కష్టపడ్డానని, రాముడి హుందాతనం, నడక, నిలబడే విధానం కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నట్లు తెలిపారు. రాజమౌళి ప్రతి చిన్న అంశాన్ని ఎంతో శ్రద్ధగా మలిచారని, చివరికి తాను పరిగెత్తే స్టైల్‌ను కూడా మార్చేశారని మహేష్ పేర్కొన్నారు.
అయితే, ఈ వార్తతో ఖుషీలో ఉన్న అభిమానులకు మహేష్ ఒక చిన్న షాక్ ఇచ్చారు. శ్రీరాముడి పాత్ర కోసం తాను దాదాపు ఎనిమిది తొమ్మిది నెలల పాటు కఠోరంగా శ్రమించినప్పటికీ, సినిమాలో ఆ పాత్ర కేవలం ఒకటి రెండు షాట్లకే పరిమితం కావచ్చని ఆయన హింట్ ఇచ్చారు. అంటే వెండితెరపై మహేష్ బాబు రాముడిగా కనిపించేది కేవలం కొన్ని నిమిషాలు మాత్రమేనని తెలుస్తోంది. రాజమౌళి మరో ఇంటర్వ్యూలో సినిమాలో మైథాలజీ ఎపిసోడ్ కేవలం 25 నిమిషాలు మాత్రమే ఉంటుందని చెప్పడం, అందులో కూడా రాముడి పాత్ర నిడివి తక్కువని తెలియడంతో అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు.
ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనాస్ హీరోయిన్గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపిస్తున్నారు. యాక్షన్, అడ్వెంచర్, టైమ్ ట్రావెల్ వంటి విభిన్న అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 7, 2027న విడుదల కానుంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఐమ్యాక్స్ ఫార్మాట్లో కూడా రాబోతోంది. రాముడిగా కనిపించే సమయం తక్కువే అయినా, ఆ ఉన్నంతసేపు మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.









