తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. అసెంబ్లీలో గురువారం అప్పులపై చర్చ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య మాటల యుద్ధం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిందంటూ అందుకు సంబంధించిన వివరాలను డిప్యటీ సీఎం భట్టి విక్రమార్క సభలో వెల్లడించారు. ఈ నేపథ్యంలో హరీశ్ రావు మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తొలి సంవత్సరమే రూ. 1.25 లక్షల కోట్ల అప్పు చేసిందని హరీశ్ రావు ఆరోపించారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా సమర్పిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు 7 లక్షల కోట్లు కాదని.. 4 లక్షల కోట్లేనని తెలిపారు. భూములు కుదువపెట్టి అప్పులు తీసుకునేందుకు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని కాంగ్రెస్ సర్కారుపై ఆరోపణలు చేశారు.
రూ. 75 కోట్లకు ఎకరం చొప్పున టీజీఐఐసీ భూములు అమ్మే ప్రయత్నం చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మెస్ ఛార్జీలు పెంచిందని చెప్పారు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. వ్యవసాయ యంత్ర పరికరాలకు రాయితీ నిధులిచ్చామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదే రూ. 1.25 కోట్లు అప్పు చేసింది. ఈ లెక్కన అప్పులు చేస్తే ఐదేళ్లలోనే గత ప్రభుత్వ అప్పును మించిపోతారన్నారు.
తాము పదేళ్లలో రూ. 7 లక్షల కోట్లు అప్పు చేస్తే.. కాంగ్రెస్ సర్కారు అప్పు ఐదేళ్లలోనే రూ. 7 లక్షల కోట్లు దాటిపోతుందని హరీశ్ రావు అన్నారు. రెవెన్యూ రాబడి, రెవెన్యూ వ్యయం పరంగా చూస్తే.. తాము కూడా మిగులు బడ్జెట్ రాష్ట్రాన్నే ఈ ప్రభుత్వానికి అప్పగించామని హరీశ్ రావు తెలిపారు. రూ. 2.93 లక్షల కోట్ల బడ్జెట్ తో రాష్ట్రాన్ని కాంగ్రెస్ సర్కారుకు అప్పగించామన్నారు.
తెలంగాణ సొంత ఆదాయం పదేళ్ల క్రితం రూ. 35 వేల కోట్లు ఉంటే.. పదేళ్లలో రూ. 1.50 వేల కోట్లకు పెంచామని హరీశ్ రావు చెప్పారు. కరోనా, కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగానే రాష్ట్రానికి ఆదాయం తగ్గిందని చెప్పుకొచ్చారు. ఆదాయం తగ్గడం వల్ల రాష్ట్రంపై కొంత అప్పుల భారం పడిందని పేర్కొన్నారు. తాము అప్పులు చేసినా.. రాష్ట్ర ఆదాయం పెంచామని చెప్పుకొచ్చారు.








