దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంపై సినీ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో ఒక కీలక అప్డేట్ హల్చల్ చేస్తోంది. ఈ కథలో మహేష్‌బాబు తండ్రి పాత్ర అత్యంత కీలకమైనదిగా ఉండబోతుందని సమాచారం. ఈ ముఖ్య పాత్ర కోసం పలువురు సీనియర్ నటుల లుక్ టెస్ట్‌లు నిర్వహించిన రాజమౌళి, చివరకు ఆ పాత్రకు ప్రకాష్‌రాజ్‌ను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ వార్త నెట్టింట వైరల్‌గా మారగా, ఇండస్ట్రీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం… అధికారిక ప్రకటన ఇంకా వెలువడనప్పటికీ, ప్రకాష్‌రాజ్ ఇప్పటికే షూటింగ్ లొకేషన్లో అడుగుపెట్టారని, ఆయనపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ కూడా మొదలైందని తెలుస్తోంది. మహేష్‌బాబు-ప్రకాష్‌రాజ్ కాంబినేషన్‌కు గతంలో ఉన్న ట్రాక్ రికార్డ్ అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది.
గతంలో ‘దూకుడు’ మరియు ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి సినిమాల్లో ప్రకాష్‌రాజ్ మహేష్‌బాబుకు తండ్రిగా నటించి, బలమైన ఎమోషన్‌ను పండించారు. ఈ సెంటిమెంట్ పలకడంతో పాటు, వారిద్దరి కలయికలో వచ్చిన ‘ఒక్కడు’, ‘పోకిరి’, ‘అతడు’, ‘అర్జున్’ వంటి సినిమాలు కూడా బ్లాక్బస్టర్లు కావడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి. రాజమౌళి లాంటి దర్శకుడి సినిమాలో మహేష్‌కు తండ్రిగా ప్రకాష్‌రాజ్ నటిస్తే, ఆ పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








