‘ది లెజెండ్’ సినిమాతో వెండితెరకు పరిచయమైన అరుళ్ శరవణన్, ఇప్పుడు తన రెండో చిత్రంగా ‘లీడర్’తో అలరించబోతున్నారు. ఆర్ఎస్ దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలతో నిండిన ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో శరవణన్ సరసన పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్గా నటిస్తుండగా, గ్లింప్స్‌లోని విజువల్స్ సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి.
ఈ సినిమా కథాంశం ప్రధానంగా తండ్రీకూతుళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. అండర్ వరల్డ్ మాఫియా మరియు పోలీసు బలగాల మధ్య చిక్కుకున్న ఒక సామాన్య వ్యక్తి, తన బిడ్డను కాపాడుకోవడానికి ఎంతటి సాహసం చేశాడనేది ఈ చిత్ర ప్రధాన ఇతివృత్తం. గ్లింప్స్‌లో మాఫియా ముఠాలను హీరో ఒంటిచేత్తో మట్టుబెట్టడం, అక్కడే ఉన్న ఒక చిన్నారి తన తండ్రి గురించి చెప్పే “ఏ బిడ్డకైనా తండ్రే హీరోరా” అనే డైలాగ్ సినిమాలోని ఎమోషనల్ యాక్షన్‌ను హైలైట్ చేస్తోంది. ఇది కేవలం పొలిటికల్ డ్రామా మాత్రమే కాదని, బలమైన సెంటిమెంట్ ఉన్న యాక్షన్ థ్రిల్లర్ అని మేకర్స్ స్పష్టం చేశారు.
లెజెండ్ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమాలో పాయల్ రాజ్‌పుత్‌తో పాటు ఆండ్రియా, అమృత అయ్యర్, శ్యామ్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జిబ్రాన్ వైభోద సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో వేడుకను త్వరలోనే నిర్వహించనున్నారు. ‘ది లెజెండ్’ తర్వాత శరవణన్ ఈసారి పక్కా మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో బాక్సాఫీస్ వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.









