హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు జారీ చేసింది. రెండో దశలో మొత్తం 76.4 కిలోమీటర్ల మేర మెట్రో రైలు నిర్మాణం చేపట్టేందుకు అనుమతి లభించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో 196ని జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రెండో దశ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టనున్నారు.
మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 24,269 కోట్లు అంచనాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం రూ. 7333 (30 శాతం) , కేంద్రం రూ. 4230 (18 శాతం), రూ. 11, 693 (48 శాతం) అప్పు, రూ. 1033 కోట్ల (4 శాతం) ప్రైవేట్ సంస్థలు తీసుకురావాలని నిర్ణయించారు.
రెండో దశ మెట్రో రైలు ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం ఆరు కారిడార్లలో మొత్తం 116.4 కిలో మీటర్ల మేర మెట్రో లైన్ ను నిర్మించాలని భావించింది. ఇప్పటి వరకు ఐదు కారిడార్లకు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది.
రెండో దశ పార్ట్-ఏలో ఐదు కారిడార్ల నిర్మాణం
కారిడార్ 4: నాగోలు నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు (36.8 కి.మీ)
కారిడార్ 5: రాయదుర్గం నుంచి కోకాపేట నియోపోలిస్ (11.6 కి.మీ)
కారిడార్ 6: ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట (7.5 కి.మీ)
కారిడార్ 7: మియాపూర్ నుంచి పటాన్ చెరు (13.4 కి.మీ)
కారిడార్ 8: ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ (7.1 కి.మీ)
మెట్రో రైలు రెండో దశ పార్ట్ బీ
కారిడార్ 9: శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు
మొదటి దశలో గత ప్రభుత్వాలు రూ. 22,000 కోట్లతో పీపీపీ మోడల్లో మూడు కారిడార్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో మార్గాలను నిర్మించాయి. ప్రస్తుతం రోజూ దాదాపు 5 లక్షల మంది ప్రయాణికులు మెట్రోను వినియోగిస్తున్నారు. రెండో దశ కూడా పూర్తయితే రోజుకు 8 లక్షల మంది వరకు ప్రయాణికులను గమ్యస్థానాలను చేరవేయనుంది.









