టాలీవుడ్లో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న వి.వి వినాయక్ కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, రామ్ చరణ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
రామ్ చరణ్ గురించి మాట్లాడుతూ వినాయక్—చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ చరణ్ చాలా డౌన్ టు ఎర్త్ అని అన్నారు. బయటకు చూడటానికి రాయల్‌గా, క్లాస్‌గా కనిపించినా, వ్యక్తిత్వంలో ఎంతో సరళత ఉంటుందని తెలిపారు. ఇతర హీరోల మాదిరిగా హిట్ డైరెక్టర్ల వెంట తిరిగే వ్యక్తి కాదని, ఒకసారి ఎవరైనా డైరెక్టర్‌కు మాట ఇచ్చాక పరిస్థితులు ఎలా ఉన్నా ఆ మాట తప్పకుండా నిలబెట్టుకుంటాడని చెప్పారు. చరణ్ మాట నిలబెట్టుకునే వ్యక్తి అని ప్రశంసించారు.
ఇదిలా ఉంటే, వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘నాయక్’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. అలాగే చరణ్ నిర్మాణంలో చిరంజీవి హీరోగా వచ్చిన ‘ఖైదీ నెంబర్ 150’ చిత్రాన్ని కూడా వినాయక్ తెరకెక్కించారు. చరణ్ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా, అందరితో వినయంగా, గౌరవంగా ఉంటాడని ఇప్పటికే చాలా మంది చెప్పగా, ఇప్పుడు వినాయక్ కూడా అదే విషయాన్ని మరోసారి గుర్తు చేశారు.
ప్రస్తుతం రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్‌గా కొనసాగుతూ, బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ‘పెద్ది’ సినిమాలో బిజీగా ఉన్నాడు. గ్రామీణ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక రిలీజ్ విషయానికి వస్తే, మొదట చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న విడుదల చేయాలని భావించినా, షూటింగ్ ఆలస్యంతో ఏప్రిల్ 30కు వాయిదా వేశారు. అయితే మరోసారి వాయిదా పడే అవకాశముందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నా, చిత్ర బృందం మాత్రం దీనిపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. ఇప్పుడు ఈ సినిమా అనుకున్న తేదీకి వస్తుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.









