మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి ఈడీ షాకిచ్చింది. పీజీ మెడికల్ సీట్ల అక్రమాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు గురువారం మల్లారెడ్డికి నోటీసులు అందజేశారు. గత సంవత్సరం జూన్‌లో మల్లారెడ్డికి చెందిన 12 మెడికల్ కళాశాలల్లో అధికారులు దాడులు చేశారు. ఈడీ సోదాల్లో కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు పీజీ మెడికల్ సీట్లు ఇల్లీగల్ గా బ్లాక్ చేసినట్లు గుర్తించారు. తెలంగాణలోని 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 45 సీట్లను అక్రమంగా బ్లాక్ చేసి కోట్ల రూపాయలకు అమ్ముకున్నట్లు ఈడీ తేల్చింది.
ఇందుకు సంబంధించి అధికారులు మల్లారెడ్డిని వివరణ కోరుతూ నోటీసులు ఇచ్చారు. ఈడీ మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో రెండు రోజుల పాటు సోదాలు చేసింది. లెక్కలు చూపని కోటి 40 లక్షల నగదును స్వాధీనం చేసుకుంది. కాలేజీకి సంబంధించిన అకౌంట్లలో రెండు కోట్ల 89 లక్షలు నగదు కూడా సీజ్ చేసింది. 2022 ఏప్రిల్‌లో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు పీజీ సీట్లను అక్రమంగా బ్లాక్ చేసి అమ్ముకున్నారని మెడికల్ యూనివర్సిటీ అధికారులు వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దాడులు చేసింది. అప్పుడు సోదాల్లో లభించిన పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్ అన్నింటిని విశ్లేషించిన ఈడీ అధికారులు ఇప్పుడు నోటీసులు జారీ చేశారు. 2022 నవంబర్ లో ఐటీ అధికారులు మల్లారెడ్డి ఇంట్లో సోదాలు చేశారు. మల్లారెడ్డికి సంబంధించిన కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో దాడులు చేశారు. మల్లారెడ్డి యూనివర్సిటీ, మల్లారెడ్డి కాలేజీల్లో సోదాలు చేశారు. ఆయన కూతురు, కొడుకు, అల్లుడి నివాసాలతో పాటు మల్లారెడ్డి తమ్ముళ్ల నివాసాల్లో దాడులు చేశారు.
మల్లారెడ్డికి మెడికల్ కాలేజీలే కాకుండా ఇంజినీరింగ్ కాలేజీలు కూడా ఉన్నాయి. ఆయన విద్యాసంస్థలు స్థాపించి భారీగా సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి చెరువులను ఆక్రమించినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆయన మాత్రం పాలు, పూలు అమ్మి ఇన్న కోట్లు సంపాదించినట్లు చెప్పుకుంటారని.. పాలు, పూలు అమ్మితే వేల కోట్లు సంపాదించగలమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నోటీసులపై మల్లారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.








