కేంద్రమంత్రి బండి సంజయ్ శనివారం హైదరాబాద్ నగరంలోని అశోక్ నగర్ చౌరస్తాకు వెళ్లారు. కేంద్రమంత్రి రాకతో భారీగా గ్రూప్ 1 అభ్యర్థులు అక్కడికి చేరుకున్నారు. వారిని పరామర్శించిన బండి సంజయ్.. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చలో సచివాలయానికి పిలుపునిచ్చారు. గ్రూప్-1 అభ్యర్థులతో కలిసి సచివాలయం వైపు ర్యాలీగా బయల్దేరారు. దీంతో ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.
ఈ సందర్బంగా పోలీసులు తీరుపై బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎంను కలిసి వాస్తవాలు వివరించేందుకు వెళుతున్నామని చెప్పారు. సచివాలయానికి వెళ్లి తీరుతామని తేల్చిచెప్పారు. దీంతో పోలీసులు బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్నారు. లోయర్ ట్యాంక్ సమీపంలో బండి సంజయ్ ను పోలీసు వాహనం ఎక్కించి అక్కడ్నుంచి తరలించారు. దీంతో గ్రూప్ 1 అభ్యర్థులు, బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. కాగా, పోలీసులు బండి సంజయ్‌ను నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి తరలించారు.
భారీ సంఖ్యలో ర్యాలీకి హాజరైన గ్రూప్ 1 అభ్యర్థులు, బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. మరోవైపు, బీఆర్ఎస్ నేతలు కూడా ఈ ర్యాలీలో చేరేందుకు ప్రయత్నించడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. బండి సంజయ్ ను అదుపులోకి తీసుకున్న తర్వాత.. ర్యాలీగా వచ్చిన గ్రూప్ 1 అభ్యర్థులు, పార్టీల కార్యకర్తలను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు, బీఆర్ఎస్ నేతలు శ్రీనివాస్ గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్ లను పోలీసులు అడ్డుకుని అక్కడ్నుంచి తరలించారు.
అంతకుముందు కేంద్ర మంత్రి బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ.. తమ జీవితం నాశనం అవుతుందన్న టెన్షన్‌తో యువత గత వారం రోజులుగా ఆందోళనలు చేస్తోందని.. పరీక్షలకు సిద్ధమైనా.. పరీక్ష రాసే పరిస్థితి లేదని.. 29వ జీవోను రద్దు చేయాలని వారు కోరుతున్నారు. జీవో 29ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సచివాలయానికి వెళుతున్నాం. నేను ఆందోళనకారులను ఆపడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ వారు నా మాట వినడం లేదు అని బండి సంజయ్ తెలిపారు.
29 జీవోతో ప్రభుత్వం నిరుద్యోగ యువతకు వెన్నుపోటు పొడిచిందని బండి సంజయ్ మండిపడ్డారు. ఆ జీవోను రద్దు చేసే వరకే నిరుద్యోగులకు మద్దతుగా తమ పోరాటం కొనసాగుతుందన్నారు. కాగా, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల వాయిదా, జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గత కొద్ది రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం పెద్ద ఎత్తున నిరసనలు చేయగా.. పోలీసులు లాఠీఛార్జీ చేశారు. ఈ నేపథ్యంలోనే అభ్యర్థులకు మద్దతుగా శనివారం బండి సంజయ్ అశోక్ నగర్ చేరుకున్నారు.








