గత కొంతకాలంగా తెలుగు సినీ పరిశ్రమలో తెలంగాణ నేపథ్య కథలకు మంచి డిమాండ్ ఏర్పడింది. తెలంగాణ మట్టిలో పుట్టిన కథలు, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే భావోద్వేగ కథలతో దర్శకులు ప్రేక్షకులను బలంగా కనెక్ట్ అవుతున్నారు. ఈ కోవలో వచ్చిన ‘బలగం’ చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా తెలంగాణ గ్రామాల్లో తెరలు కట్టుకుని చూసేంతగా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది.
‘బలగం’ విజయంతో ప్రేరణ పొందిన దర్శకులు, నిర్మాతలు ఇప్పుడు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో మరిన్ని కథలను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మరో ఆసక్తికర ప్రాజెక్ట్ త్వరలో సెట్స్‌పైకి వెళ్లబోతోంది.
ప్రముఖ దర్శకుడు సుకుమార్ తన సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ ద్వారా ఇప్పటికే పలు ప్రాజెక్టులకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న ‘వృషఖర్మ’, అలాగే రామ్‌చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రాల్లో ఈ సంస్థ భాగస్వామ్యంగా ఉంది.
ఇదిలా ఉండగా, తాజాగా సుకుమార్ మరియు నిర్మాత బన్నీ వాస్ కలిసి మరో కొత్త చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. ‘బలగం’ ఫేమ్ ప్రియదర్శి ఈ చిత్రంలో హీరోగా నటించనున్నట్టు సమాచారం. తెలంగాణ నేపథ్య కథతో తెరకెక్కనున్న ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడు.
ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. దర్శకుడిగా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోలతో భారీ చిత్రాలు తెరకెక్కిస్తున్న సుకుమార్, నిర్మాతగా చిన్న సినిమాలకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి కథలను ముందుకు తీసుకురావడం నిజంగా అభినందనీయం..









