ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ‘ధురంధర్’ సినిమా సృష్టించిన సంచలనం గురించే చర్చ జరుగుతోంది. రణవీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాలీవుడ్లో కొత్త రికార్డులను సెట్ చేసింది.
ఈ బ్లాక్‌బస్టర్ విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న జియో స్టూడియోస్… ఇప్పుడు టాలీవుడ్ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘పెద్ది’పై దృష్టి పెట్టింది. ఈ సినిమాను నార్త్ ఇండియాలో భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ ఒక పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నార్త్ ఇండియా డిస్ట్రిబ్యూషన్ హక్కులను జియో స్టూడియోస్ భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
‘ధురంధర్’ లాంటి మెగా హిట్ తర్వాత జియో స్టూడియోస్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమా కావడంతో… హిందీ మార్కెట్లో ‘పెద్ది’పై అంచనాలు స్కై హైకి చేరాయి. ముఖ్యంగా ‘RRR’ తర్వాత రామ్ చరణ్‌కు వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ ఈ డీల్‌ను మరింత హాట్ టాపిక్‌గా మార్చింది.
1980ల ఆంధ్రప్రదేశ్ నేపథ్యంలో సాగే ఈ కథలో రామ్ చరణ్ పల్లెటూరి యువకుడిగా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయన పూర్తిగా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యి, ఉత్తరాంధ్ర యాసలో డైలాగ్స్ చెప్పబోతున్నారనే వార్తలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నాయి.
ఈ చిత్రంలో చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా… కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు ఇప్పటికే వచ్చిన పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం 2026 ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇప్పటికే విడుదలైన ‘పెద్ది పహిల్వాన్’ గ్లింప్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు జియో స్టూడియోస్ లాంటి పెద్ద సంస్థ ఈ ప్రాజెక్ట్‌కు సపోర్ట్ ఇవ్వడంతో… ‘పుష్ప’, ‘RRR’ తరహాలో నార్త్ ఇండియాలో కూడా భారీ ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మరి ‘ధురంధర్’ ఇచ్చిన హైప్‌ను జియో స్టూడియోస్ ‘పెద్ది’తో కూడా కొనసాగిస్తుందా… లేదా అన్నది చూడాలి.









