పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతకాలంగా ఎదురుచూస్తున్న ఆ క్షణం ఎట్టకేలకు వచ్చేసింది. టాలీవుడ్‌ను షేక్ చేసిన మోస్ట్ పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’కి సీక్వెల్ రాబోతుందనే అధికారిక సంకేతాలు రావడంతో ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఒక్కటే పేరు మార్మోగుతోంది.. అదే ‘ఓజీ 2’.
‘రన్ రాజా రన్’, ‘సాహో’ వంటి చిత్రాలతో తన మార్క్ చూపించిన దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ‘ఓజీ’.. విడుదలైన నాటి నుంచి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం.. పవన్ కళ్యాణ్‌ను అభిమానులు ఇంతకుముందెన్నడూ చూడని స్టైలిష్, రూత్‌లెస్ గ్యాంగ్‌స్టర్‌గా వెండితెరపై ఆవిష్కరించింది.
ముంబై బ్యాక్‌డ్రాప్, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన యాటిట్యూడ్.. ఇవన్నీ కలిసి ‘ఓజీ’ని ఒక కల్ట్ యాక్షన్ ఎంటర్టైనర్గా నిలబెట్టాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన ఈ సినిమా టాలీవుడ్లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసింది.
అయితే సినిమా ప్రమోషన్స్ సమయంలోనే దర్శకుడు సుజీత్.. ఈ కథలో ఇంకా చెప్పాల్సిన అంశాలు చాలా ఉన్నాయని, పరిస్థితులు అనుకూలిస్తే ‘ఓజీ 2’ తప్పకుండా ఉంటుందని హింట్ ఇచ్చారు. అప్పటి నుంచి అభిమానులు సీక్వెల్ అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పుడు వారి ఎదురుచూపులకు తెరపడింది. పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన అప్డేట్ను షేర్ చేసింది. “ప్రామిస్ చేసినట్లుగానే ఆయన తిరిగి వస్తారు. ఎప్పుడు వస్తారనేది ఆయనే స్వయంగా ప్రకటిస్తారు” అంటూ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అంతేకాదు.. ప్రస్తుతం దర్శకుడు సుజీత్ విదేశీ పర్యటనలో ఉన్నారని, ఆయన తిరిగి వచ్చిన వెంటనే ‘ఓజీ 2’కు సంబంధించిన స్క్రిప్ట్ డిస్కషన్స్, ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగం పుంజుకోనున్నాయని సమాచారం. దీంతో పవర్‌స్టార్ అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
మరి మొదటి భాగంతో రికార్డులు తిరగరాసిన ‘ఓజీ’.. ఇప్పుడు రెండో భాగంతో ఎలాంటి విధ్వంసం సృష్టించబోతోంది? పవన్ కళ్యాణ్ మరోసారి గ్యాంగ్‌స్టర్ అవతారంలో ఎన్ని కొత్త రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి. ఒక విషయం మాత్రం ఖాయం… ‘ఓజీ 2’ ప్రకటనతోనే టాలీవుడ్లో పవర్‌స్టార్ మ్యానియా మరోసారి మొదలైంది.









