అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం ఫుల్ జోష్‌లో ఉన్నాడు. ఈ ఏడాది వచ్చిన ‘తండేల్’ మూవీ భారీ విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు ఆయన నటిస్తున్న కొత్త సినిమా ‘వృషకర్మ’పై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ‘విరూపాక్ష’ వంటి బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు తెరకెక్కిస్తున్న ఈ మైథికల్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ఇప్పటికే టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం మొదట అనుకున్న సమయానికి విడుదల కాలేకపోయినా.. ఇప్పుడు కొత్త రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది.
డిసెంబర్లో ‘వృషకర్మ’ గ్రాండ్ రిలీజ్!
నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్, పోస్టర్స్, కాన్సెప్ట్ గ్లింప్స్ అన్నీ కూడా మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్లో థియేటర్లలోకి రావడానికి రెడీ అవుతోంది.
ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రబృందం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ముఖ్యంగా డిసెంబర్లో పెద్ద స్టార్ సినిమాలు లేకపోవడం కూడా ‘వృషకర్మ’కు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. దీంతో సోలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఖచ్చితమైన రిలీజ్ డేట్‌ను మేకర్స్ త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
నాగచైతన్య కెరీర్లోనే భారీ మూవీ?
‘వృషకర్మ’ను నాగచైతన్య కెరీర్లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ‘విరూపాక్ష’తో తన మార్క్ చూపించిన దర్శకుడు కార్తీక్ దండు ఈ సినిమాను కూడా హై టెక్నికల్ వాల్యూస్‌తో రూపొందిస్తున్నాడు. ఇప్పటికే సినిమా బిజినెస్ కూడా ఊహించని రేంజ్లో జరుగుతోందని టాక్.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత నాగ వంశీ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఓవర్సీస్ మార్కెట్లో కూడా ఈ సినిమాకు మంచి డిమాండ్ ఏర్పడిందట. మొత్తం థియేట్రికల్ బిజినెస్ దాదాపు రూ.55 కోట్ల వరకు జరిగినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల క్లబ్లో చేరుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అభిమానులు మాత్రం ‘వృషకర్మ’ నాగచైతన్య కెరీర్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్తుందని నమ్మకంగా ఎదురుచూస్తున్నారు.









