బాలీవుడ్ నటి దీపికా పడుకొణే రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని స్పష్టం చేసిన నేపథ్యంలో, సినీ పరిశ్రమలో పని గంటలపై చర్చ జరుగుతోంది. ఈ అంశంపై టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు చేశారు. నటన అనేది ఉద్యోగం కాదని, ఇన్ని గంటలే పనిచేయాలని నిర్వచించడం కష్టమని ఆయన అభిప్రాయపడ్డారు. 8 గంటలు కదలకుండా పనిచేస్తే అద్భుతమైన ఔట్పుట్ రావడానికి యాక్టింగ్ అనేది ఒక ప్రాజెక్ట్ కాదని ఆయన స్పష్టం చేశారు.
నటన అనేది ఒక లైఫ్‌స్టైల్ అని, నటులు దీనిని నిత్య జీవితంలో భాగంగా చేసుకోవాలని రానా సూచించారు. ఈ లైఫ్‌స్టైల్‌ను కొనసాగించాలా? వద్దా? అనేది పూర్తిగా ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన అంశమని తెలిపారు. మిగతా రంగాలతో పోలిస్తే సినిమా రంగం చాలా భిన్నమైనదని, ఇండస్ట్రీలో ప్రతి విభాగంలోనూ నటీనటులు భాగమైతేనే గొప్ప సన్నివేశాలు వస్తాయని రానా పేర్కొన్నారు.
మరోవైపు, నటుడు దుల్కర్ సల్మాన్ కూడా ఈ చర్చలో స్పందించారు. ఒకరోజు అదనపు షూటింగ్ కంటే రోజూ కొన్ని గంటలు అదనంగా పనిచేయడం సులువని అభిప్రాయపడ్డారు. మలయాళంలో షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని, కానీ తమిళ ఇండస్ట్రీలో నెలకు రెండు ఆదివారాలు సెలవు ఇస్తారని ఆయన తన అనుభవాన్ని వివరించారు. తెలుగులో ‘మహానటి’ షూటింగ్ సమయంలో కొన్నిసార్లు సాయంత్రం 6 గంటలకే ఇంటికి వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయని దుల్కర్ గుర్తుచేసుకున్నారు.









