తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం సరఫరా నిలిచిపోయింది. సాంకేతిక సమస్య కారణంగా మద్యం డిపోల నుంచి డీలర్లు మద్యం తెచ్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం మద్యం సరఫరా పూర్తి ఆన్లైన్ ద్వారానే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
బుధవారం రాత్రి లోపు సర్వర్ సమస్య పరిష్కారమవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ తర్వాత మద్యం దుకాణాలకు మద్యం సరఫరా అయ్యే అకాశం ఉంది.
ఇది ఇలావుండగా, తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషిస్తున్న ప్రభుత్వం మద్యం ధరలు పెంచేందుకు కసరత్తు చేస్తోంది. అందుకే ఎక్సైజ్‌శాఖ ధరల పెంపుపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. లిక్కర్ ధరలు పెంచ్చొద్దని భావించినప్పటికీ సరిహద్దు రాష్ట్రాల్లో ధరలు పెరగడంతో ఇక్కడ కూడా ధరలు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
హార్డ్ మద్యంపై రూ.10 నుంచి రూ.90, బీరుపై రూ.15-20 పెంచేందుకు ఎక్సైజ్ శాఖ ప్లాన్ చేస్తోంది. చీప్ లిక్కర్ బ్రాండ్లపై తక్కువ.. ప్రీమియం బ్రాండ్లపై ఎక్కువ రేట్లు పెంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మద్యం ధరలు పెంచితే రాష్ట్ర ఖజానాకు నెలకు రూ.500 కోట్ల నుంచి రూ.700 కోట్ల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖ నుంచి రూ.36 వేల కోట్ల ఆదాయం వస్తుంది. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఈ డబ్బు వస్తుంది.
కాగా, ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 6 నెలల్లో ఆబ్కారీ శాఖకు రూ.17 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. మిగిలిన 6 నెలల్లో కూడా ఇంతే స్థాయిలో ఆదాయం వస్తుందని భావిస్తున్నారు. తెలంగాణలో రోజుకు సరాసరిగా రూ.90 కోట్ల విలువైన మద్యం విక్రయిస్తున్నారు. దీన్ని బట్టి నెలకు రూ.2700 కోట్ల నుంచి రూ.3000 కోట్ల వరకు మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎక్సైజ్ ఆదాయం తోపాటు రిజిస్ట్రేషన్ల ఆదాయం పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది.









