రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత చోటు చేసుకుంటూ వస్తోన్న పరిణామాలు అనూహ్య మలుపులు తిరిగేలా కనిపిస్తోన్నాయి.
ప్రత్యేకించి- శాంతిభద్రతల వ్యవహారం అటు జాతీయస్థాయిలోనూ చర్చనీయాంశమౌతోంది. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రవ్యాప్తంగా మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే. నంద్యాల, తిరుపతి, శ్రీకాకుళం, కడప, కాకినాడ.. వంటి పలు జిల్లాల్లో హత్యాచార ఉదంతాలు జరిగాయి.
ఈ పరిణామాలపై చంద్రబాబు కూటమి కీలక భాగస్వామ్య పార్టీ జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలం అయ్యామనే అభిప్రాయం ప్రజల్లో నెలకొని ఉందని, తాను హోం శాఖ తీసుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయనీ వ్యాఖ్యానించారు.
ఇదే అంశం అటు మంత్రివర్గ సమావేశంలోనూ ప్రస్తావనకు వచ్చినట్లు చెబుతున్నారు. హోం మంత్రిత్వ శాఖ పనితీరుపై పవన్ కల్యాణ్ బాహటంగా చేసిన వ్యాఖ్యలు, దాని తరువాత చోటు చేసుకున్న పరిణామాలపై మంత్రులు చర్చించారని, బాహటంగా విమర్శలు చేయడం సరికాదని సీనియర్లు అభిప్రాయపడినట్లు చెబుతున్నారు.
దీనిపై పవన్ కల్యాణ్ వివరణ ఇచ్చుకున్నారని సమాచారం. కూటమి ప్రభుత్వాన్ని కించపరిచేలా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు సోషల్ మీడియాలో వేస్తోన్న పోస్టులపై పట్టీ పట్టనట్టు వ్యవహరించడం మంచిది కాదని, గత ప్రభుత్వంలో పని చేసిన కొందరు అధికారులు ఇప్పుడు కూడా కీలక హోదాల్లో ఉంటోన్నారని పేర్కొన్నట్లు చెబుతున్నారు.
సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టులను తప్పుపట్టడంలో భాగంగా తాను కొంతమేర ఘాటుగా స్పందించాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్వివరణ ఇచ్చారని అంటున్నారు. హోం మంత్రిత్వ శాఖలో కొందరు ఉన్నతాధికారులు పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన కొద్దిరోజుల్లోనే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో పవన్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
మంత్రివర్గ భేటీ ముగిసిన వెంటనే పవన్ కల్యాణ్.. హస్తినకు బయలుదేరి వెళ్లారు. కొద్దిసేపటి కిందటే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు, తాజా రాజకీయ అంశాల గురించి పవన్ కల్యాణ్ వివరించారని అంటున్నారు.








