‘మిరాయ్’ సినిమాతో విలన్‌గా ఘనవిజయం అందుకున్న మంచు మనోజ్, ఇప్పుడు హీరోగా తన పవర్‌ను చూపించడానికి సిద్ధమయ్యారు. ఆయన కథానాయకుడిగా హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో రూపొందుతున్న లేటెస్ట్ పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డేవిడ్ రెడ్డి’. తాజాగా ఈ చిత్ర బృందం విడుదల చేసిన టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం మరియు ఇంగ్లీష్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
టీజర్ ప్రకారం, ఈ కథ బ్రిటిష్ ఇండియా కాలం నాటిది. “డేవిడ్ రెడ్డిని చూసి బ్రిటిష్ వారు భయపడ్డారు, సొంత జనాలు అపార్థం చేసుకున్నారు” అన్న డైలాగులు కథలోని లోతును తెలియజేస్తున్నాయి. మంచు మనోజ్ ఇందులో ‘వార్ డాగ్’ అనే విభిన్నమైన లుక్‌లో కనిపిస్తున్నారు. ముఖ్యంగా టీజర్లో ఆయన చెప్పిన “యే బ్రిటీష్ ఇండియా నహీ హై.. యే డేవిడ్ రెడ్డి కా ఇండియా హై” అనే డైలాగ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
ఈ చిత్రానికి సాంకేతిక బృందం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. KGF వంటి భారీ చిత్రాలకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రురు నేపథ్య సంగీతం, ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి పనితీరు టీజర్లో స్పష్టంగా కనిపిస్తోంది. పీరియాడికల్ డ్రామా కావడంతో నాటి వాతావరణాన్ని అద్భుతంగా వెండితెరపై ఆవిష్కరించినట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో ఈ చిత్రం ఒక మైలురాయిగా నిలుస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.








