తెలుగులో శ్రీ విష్ణు ‘అల్లూరి’, తమిళంలో ‘డ్రాగన్’ వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar), గత కొంతకాలంగా తనపై వస్తున్న ట్రోల్స్, రూమర్స్ పట్ల తాజాగా ఓ తమిళ మీడియా ఇంటర్వ్యూలో స్పందించింది. కొన్ని రోజుల క్రితం తమిళనాడు రాజకీయాలను కుదిపేసిన ఒక మనీ ఫ్రాడ్ కేసులో ఆమె పేరు వినిపించింది. ఒక నైట్ పార్టీకి హాజరైనందుకు ఆమెకు 35 లక్షల రూపాయలు చెల్లించారని, పోలీసులు విచారణకు కూడా పిలిచారనే పుకార్లు అప్పట్లో గుప్పుమన్నాయి. ఈ ఊహాగానాలపైనే కాయదు లోహర్ తాజాగా తన ఆవేదనను వ్యక్తం చేసింది.
తాను ఏం తప్పు చేశానో తనకు తెలియదని, అందరితో మంచిగా ఉండటం తప్ప వేరే ఏమీ చేయలేదని కాయదు లోహర్ వివరించింది. కేవలం తన కలలను సాకారం చేసుకోవడం కోసం ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన తనను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కాలేదని ఆమె వాపోయింది. ఆ సమయంలో వచ్చిన పుకార్లు, ట్రోల్స్ తనపై చాలా తీవ్రమైన ప్రభావం చూపించాయని ఆమె తెలిపింది. సెలబ్రిటీలు ప్రతిదీ సులభంగా హ్యాండిల్ చేస్తారని ప్రేక్షకులు అనుకుంటారని, కానీ రియాలిటీలో తమకు కూడా ట్రోల్స్ మరియు పుకార్లు బాధ కలిగిస్తాయని కాయదు లోహర్ వెల్లడించింది.
ప్రస్తుతం కాయదు లోహర్ తిరిగి తెలుగు సినిమాపై దృష్టి సారించింది. ఆమె ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా, కేవీ అనుదీప్ దర్శకత్వం వహిస్తున్న ‘ఫంకీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది మరియు వచ్చే ఏడాది ఏప్రిల్ 3న థియేటర్లలోకి రానుంది. ఈ తాజా ఇంటర్వ్యూతో అయినా తనపై వస్తున్న పుకార్లకు చెక్ పడుతుందో లేదో చూడాలి.









