ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న విజువల్ వండర్ ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (అవతార్ 3) పై టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ప్రశంసలు కురిపించారు. ఇప్పటికే రాజమౌళి ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని పంచుకోగా, తాజాగా సుకుమార్ కూడా ఈ జాబితాలో చేరారు. ఈ చిత్రం కేవలం కళ్లు చెదిరే విజువల్స్ మాత్రమే కాదని, ప్రేక్షకులను కట్టిపడేసే బలమైన భావోద్వేగాలు ఉన్న ఒక అద్భుతమైన కథ అని ఆయన కొనియాడారు.
సుకుమార్ ఈ చిత్రాన్ని ఒక ‘అబ్సల్యూట్ బ్లాక్బస్టర్’ గా అభివర్ణించారు. ఒక భారీ స్థాయి కథను ఎంతో హృద్యంగా చెప్పడంలో జేమ్స్ కామెరూన్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారని ఆయన ప్రశంసించారు. కేవలం సాంకేతిక విలువలకే పరిమితం కాకుండా, పాత్రల మధ్య ఉండే ఎమోషన్స్ ఈ సినిమాకు ప్రాణం పోశాయని, కామెరూన్ మ్యాజిక్కు తాను ఫిదా అయ్యానని సుకుమార్ వెల్లడించారు.
ఈ చిత్రం ఒక నిజమైన ‘ఈవెంట్ ఫిల్మ్’ అని, దీనిని కేవలం థియేటర్లలోనే కుటుంబంతో కలిసి చూడాలని ఆయన ప్రేక్షకులకు సూచించారు. ‘అవతార్’ ఫ్రాంచైజీ ప్రపంచ సినిమా చరిత్రలో ఒక గొప్ప అనుభవంగా నిలిచిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ట్వంటీయత్ సెంచరీ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 19న తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఘనంగా విడుదల కానుంది.








