జమిలి ఎన్నికల పై కేంద్రంలో వేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా జరిగిన ఎన్డీఏ సమావేశం తరువాత ముఖ్యులు జమిలి పైన బలమైన సంకేతాలు ఇస్తున్నారు. జమిలికి సిద్దం కావాలంటూ ఎన్డీఏ పక్షాలు సూచిస్తున్నాయి. ఇదే సమయంలో ఏపీలోనూ ఈ చర్చ మొదలైంది. సీఎం చంద్రబాబు ఈ చర్చ వేళ పాలనా పరంగా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమరావతి కేంద్రంగా పావులు కదుపుతున్నారు.
అమరావతిలో చంద్రబాబు
ఏపీ రాజధాని అమరావతిలో నేడు కీలక ఘట్టం చోటు చేసుకోనుంది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తరువాత రాజధాని అమరావతి పనులు ప్రారంభం దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ముందుగా జంగిల్ క్లియరెన్స్ పనులు ప్రారంభించారు. ఇప్పుడు ఆ పనులు చివరి దశకు చేరుకున్నాయి. మధ్యలో నిలిచిన నిర్మాణాలను పూర్తి చేసేందుకు తాజాగా సీఆర్డీఏ నిర్ణయం తీసుకుంది. దీని కోసం వచ్చే నెలలో టెండర్లను పిలవాలని నిర్ణయించారు. ఇక.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నుంచి రుణం ఆమోదం కు సూత్రప్రాయంగా ఆమోదం లభించింది.
పనులు తిరిగి ప్రారంభం
అమరావతిలో నిర్మాణాల కోసం టెండర్లు ఖరారుకు ముందే కన్సెల్టెంట్ల నియామకం పైన కసరత్తు జరుగుతోంది. ఇదే సమయంలో అమరావతిలో నేడు చంద్రబాబు పనులను తిరిగి ప్రారంభించేందుకు శ్రీకారం చుట్టనున్నారు. ఎపి సిఆర్డిఏ ప్రాజెక్ట్ ఆఫీస్ పనులను తిరిగి ప్రారంభించడం ద్వారా రాజధాని పనులను మొదలు పెట్టాలని నిర్ణయించారు. 160 కోట్లతో నాడు 7 అంతస్తుల్లో కార్యాలయ పనులను సిఆర్డిఏ ప్రారంభించింది. ఇప్పుడు ఆ పనులు పూర్తి చేయాలని నిర్ణయించారు. అదే సమయంలో అమరావతిలో పనుల షెడ్యూల్ పైన ఒక అంచనా కు వచ్చారు. రూ 49 వేల కోట్లతో తొలి దశ పనులు పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.
చంద్రబాబు ప్రణాళికలు
ఇక, ప్రపంచ బ్యాంకు రుణం ప్రస్తుత ఆర్దిక సంవత్సరంలోనే అమరావతి కోసం అందనుంది. ఈ నిధులను పూర్తిగా మౌళిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అదే విధంగా రాజధానికి స్థలాలు ఇచ్చిన రైతులకు ఈ నెలలోనే ప్లాట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. జమిలి ఎన్నికల దిశ గా కేంద్రంలో అడుగులు పడుతున్న వేళ చంద్రబాబు అలర్ట్ అయ్యారు. సంక్షేమ పథకాల అమలు పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. ఇటు రాజధాని అమరావతిలోనూ వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇందు కోసం నేటి అమరావతి పర్యటనలో చంద్రబాబు ప్రకటించే నిర్ణయాల పైన ఆసక్తి నెలకొంది.








