విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. పార్టీ ఫిరాయించిన శాసన మండలి సభ్యుడు ఇందుకూరి రఘురాజుపై పడిన అనర్హత వేటును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. అది చట్ట విరుద్దమైనదంటూ తేల్చింది.
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై గతంలో శాసన మండలి ఛైర్మన్ కొయ్యె మోషేన్ రాజు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. రఘురాజు భార్య తెలుగుదేశం పార్టీలో చేరడం, ఆయన ఆ పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్న నేపథ్యంలో- ఫిరాయింపుల నిరోధక చట్టం కింద మండలి ఛైర్మన్ ఈ చర్య తీసుకున్నారు.
దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు రఘురాజు. ఎలాంటి వివరణ కోరకుండా, షోకాజ్ నోటీస్ జారీ చేయకుండా శాసన మండలి ఛైర్మన్ ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని పిటీషన్లో పొందుపరిచారు. తాను ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించలేదని అన్నారు.
ఒక పార్టీ నుంచి చట్టసభకు ఎన్నికైన సభ్యుడు మరో పార్టీలో చేరితేనే ఫిరాయింపుల నిరోధక చట్టం వర్తిస్తుంది. ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా పార్టీ ఫిరాయించితే ఇది వర్తింపు కాదు. ఈ నిబంధన కింద రఘురాజుపై వేసిన వేటును ఏపీ హైకోర్టు కొట్టివేసింది. ఫలితంగా- మండలి సభ్యుడిగా పూర్తి కాలం పాటు అంటే 2027 నవంబర్ వరకూ కొనసాగడానికి వీలు కల్పించినట్టయింది.
ఈ నేపథ్యంలో విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కోసం ఈసీ ఇదివరకే విడుదల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలను వైఎస్ఆర్సీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పార్టీ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే శంభంగి చిన అప్పల్నాయుడిని ఎంపిక చేసింది. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన కొన్ని గంటల్లోనే ఏపీ హైకోర్టు తీర్పు వెలువడటం చర్చనీయాంశమైంది.
ఇందుకూరి రఘురాజు పూర్తి కాలం పాటు కొనసాగానికి ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో- ఇక విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఉండకపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఈ ఉప ఎన్నిక నోటిఫికేషన్ను ఈసీ రద్దు చేసే అవకాశాలు లేకపోలేదు.









