మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’ నుంచి తాజాగా ‘చికిరి చికిరి’ అనే వీడియో సాంగ్ విడుదలైంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం, జానీ మాస్టర్ కొరియోగ్రఫీతో వచ్చిన ఈ పాట మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. పెద్ది తన ప్రేయసి అచ్చియ్యమ్మ గురించి పాడుకునే ఈ రొమాంటిక్ పాట మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతున్నప్పటికీ, సోషల్ మీడియాలో దీనిపై ఫన్నీ మీమ్స్, ట్రోల్స్ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా, ‘చికిరి చికిరి’ పాటలో రామ్ చరణ్ కోసం జానీ మాస్టర్ కంపోజ్ చేసిన ఒక డిఫరెంట్ హుక్ స్టెప్పుపై నెటిజన్లు ఎక్కువగా దృష్టి పెట్టారు. “నాటు నాటు” స్టెప్పులు వేసి ఆస్కార్ వరకూ వెళ్లొచ్చిన హీరోతో అలాంటి మూమెంట్స్ చేయించడం ఏంటంటూ కొందరు నెటిజన్లు జానీ మాస్టర్‌ను విమర్శిస్తున్నారు. ట్రైన్ లో బాత్ రూమ్ లో కూర్చొని చెర్రీ స్టెప్పులు వేస్తున్నట్లు ఎడిట్ చేసి వైరల్ చేసిన ఫన్నీ మీమ్స్, రీల్స్ ప్రస్తుతం నెట్టింట సందడి చేస్తున్నాయి.
అయితే, ప్రోమోలో ఉన్న ఆ ఒక్క స్టెప్పును ట్రోల్ చేసినప్పటికీ, ఫుల్ సాంగ్ లోని మిగతా డ్యాన్స్ మూమెంట్స్, జాన్వీ అందాలు, రెహమాన్ ట్యూన్, రత్నవేలు సినిమాటోగ్రఫీ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈరోజుల్లో అగ్ర హీరోల సినిమాలకు సంబంధించి ఎలాంటి కంటెంట్ బయటకు వచ్చినా, అది ట్రెండ్ అవ్వడం లేదా ట్రోల్ అవ్వడం సాధారణంగా మారింది. ఇంతకుముందు చిరంజీవి ‘మీసాల పిల్ల’ పాటపై విమర్శలు వచ్చినా అది వైరల్ అయినట్లే, ఇప్పుడు ‘చికిరి చికిరి’ సాంగ్ కూడా వ్యూస్ పరంగా దూసుకుపోతోంది.









