తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపును సంపాదించిన వారిలో చంద్రశేఖర్ యేలేటి ఒకరు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ దర్శకుడు చివరిసారిగా 2021లో విడుదలైన ‘చెక్’ చిత్రానికి దర్శకత్వం వహించారు. నితిన్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.
తాజా సమాచారం ప్రకారం, చంద్రశేఖర్ యేలేటి తన తదుపరి చిత్రాన్ని ఓ యంగ్ హీరోతో రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. తమిళ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ తో కలిసి ప్రాజెక్ట్‌ను చేయనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందనుందని సమాచారం.
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన మరికొన్ని రోజుల్లో వెలువడే అవకాశముందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రదీప్ రంగనాథన్ మంచి ఫామ్‌లో తన కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. మరోవైపు, యేలేటి సినిమాలంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటినుంచో ప్రత్యేకమైన ఆసక్తి ఉంది.
ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే దానిపై భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో ఈ చిత్రం భారీ స్థాయిలో రూపొందనుందని తెలుస్తోంది.
మొత్తానికి, యంగ్ హీరోతో చంద్రశేఖర్ యేలేటి మరోసారి తన మ్యాజిక్‌ను చూపిస్తారా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







