మలయాళ చిత్ర పరిశ్రమను కుదిపేసిన ప్రముఖ నటిపై లైంగిక దాడి కేసులో ఎర్నాకుళం సెషన్స్ కోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుగురిని దోషులుగా నిర్ధారించిన న్యాయస్థానం, వారికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుపై స్పందించిన బాధిత నటి సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను పంచుకుంటూ, “8 ఏళ్ల 9 నెలల 23 రోజుల బాధాకరమైన ప్రయాణంలో ఇప్పుడు ఉపశమనం కలిగింది” అని పేర్కొన్నారు. ఆమె పోస్టును ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ షేర్ చేస్తూ, నమస్కారం ఎమోజీతో బాధితురాలికి తన మద్దతు తెలిపారు.
అయితే, ఈ తీర్పుపై మరో నటి మంజు వారియర్ (నిర్దోషిగా విడుదలైన నటుడు దిలీప్ మాజీ భార్య) స్పందిస్తూ, బాధితురాలికి పూర్తి న్యాయం జరగలేదని అభిప్రాయపడ్డారు. “నేరం చేసిన వారికి శిక్ష పడింది. కానీ, ఈ దారుణానికి ప్లాన్ చేసిన అసలు వ్యక్తి స్వేచ్ఛగా తిరుగుతున్నాడు. అది భయంకరమైన విషయం. ఈ నేరం వెనుక ఉన్న వారందరికీ శిక్ష పడినప్పుడే పూర్తి న్యాయం జరిగినట్టు అవుతుంది” అని ఆమె వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా బాధిత నటి ఈ కేసు చుట్టూ ఉన్న కొన్ని వదంతులపై స్పష్టతనిచ్చారు. ప్రధాన నిందితుడు తన పర్సనల్ డ్రైవర్ కాదని, తాను పనిచేసిన ఓ సినిమా నిర్మాణ సంస్థకు చెందిన డ్రైవర్ అని, అతడిని ఒకటి రెండుసార్లు మాత్రమే చూశానని తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు చట్టం ముందు అందరూ సమానం కారని అర్థమైందని ఆవేదన వ్యక్తం చేస్తూనే, తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు.








