ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం సీక్వెల్స్, ఫ్రాంచైజ్ సినిమాల హవా కొనసాగుతోంది. అయితే ఈ ట్రెండ్ ఇప్పుడు కొత్తగా వచ్చినదైనా, దానికి చాలా ఏళ్ల క్రితమే బాటలు వేసిన దర్శక నటుల్లో రాఘవ లారెన్స్ పేరు ముందుంటుంది. ముఖ్యంగా ఆయన రూపొందించిన ‘ముని’, ‘కాంచన’ సిరీస్‌లు హారర్ కామెడీ జానర్‌కు కొత్త గుర్తింపును తీసుకొచ్చాయి. భయంతో పాటు నవ్వులు పంచిన ఈ సినిమాలు సౌత్‌లోనే కాదు దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌లో ‘కాంచన’ ఫ్రాంచైజ్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
ఇప్పటికే ఈ సిరీస్‌లో వచ్చిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో, ఇప్పుడు తెరకెక్కుతున్న ‘కాంచన 4’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం లారెన్స్ ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. ‘కాంచన 4’ ఈ ఫ్రాంచైజ్‌లో చివరి సినిమా కావచ్చనే టాక్ బలంగా వినిపిస్తోంది.
ఈ వార్త అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నప్పటికీ, దీనికి ఓ బలమైన కారణం ఉందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ‘కాంచన’ సిరీస్‌ను ముగించిన తర్వాత లారెన్స్ పూర్తిగా కొత్త తరహా కథలు, కొత్త జానర్స్‌పై ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారట. ఇప్పటివరకు హారర్ కామెడీతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన.. ఇకపై భిన్నమైన కాన్సెప్ట్స్‌తో కొత్త ప్రయోగాలు చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
అంతేకాదు, మరో కొత్త ఫ్రాంచైజ్ లేదా యూనివర్స్‌ను కూడా లారెన్స్ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో ‘కాంచన 4’ నిజంగానే ఈ సిరీస్‌కు ముగింపు అవుతుందా..? లేక అభిమానులకు మరోసారి సర్‌ప్రైజ్ ఇస్తారా..? అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ సినీ అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారింది.









