బాహుబలి సినిమాల్లో కట్టప్ప పాత్రకు ఉన్న ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా, “కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడు?” అనే ప్రశ్నతోనే రెండో భాగం మొత్తం నడిపించిన రాజమౌళి, ఆ పాత్రను ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిపారు. సినిమాలో కట్టప్ప మాహిష్మతి సామ్రాజ్యానికి కట్టు బానిసగా, ఒక ప్రత్యేక దళానికి అధిపతిగా కనిపిస్తాడు.
అయితే అసలు కథ ఏంటి? కట్టప్ప ఎందుకు బానిసగా మారాడు? అతని పూర్వీకులు ఎందుకు ఈ బాధ్యతలను అప్పగించారు? అనే విషయాలపై రచయిత విజయేంద్ర ప్రసాద్ ప్రత్యేకమైన స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ఆ కథకు సంబంధించిన ప్రీ-విజువలైజేషన్ పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఇక రాజమౌళి విషయానికి వస్తే — ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో ఓ భారీ యాక్షన్ అడ్వెంచర్ చిత్రంలో బిజీగా ఉన్నారు. అందువల్ల కట్టప్ప సినిమాను ఆయనే డైరెక్ట్ చేస్తారా? లేక తన టీమ్‌లో మరో దర్శకుడికి ఈ బాధ్యతలు అప్పగిస్తారా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే ప్రాజెక్ట్ చర్చల దశలో ఉన్నప్పటికీ, సినిమాగా రూపాంతరం చెందే అవకాశాలు మాత్రం బలంగానే కనిపిస్తున్నాయి.
బాహుబలి ఫ్రాంచైజ్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ దృష్ట్యా, కట్టప్ప బ్యాక్‌డ్రాప్‌లో ఓ ప్రత్యేక సినిమా వస్తే ఆశ్చర్యం ఏమాత్రం లేదు..









