ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారంతో శ్రీకాంత్ మన్నెపురి రూపొందించిన ‘డిస్కవర్ ఆంధ్ర’ డాక్యుమెంటరీ టైటిల్ గ్లింప్స్‌ను సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ మరియు యంగ్ హీరో నవదీప్ విడుదల చేశారు. ఫారెస్ట్, నేచర్, వైల్డ్ లైఫ్‌ను అద్భుతంగా చూపించిన ఈ డాక్యుమెంటరీని పడాల సురేందర్ రెడ్డి, శ్రావ్య కూనం సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
గ్లింప్స్ విడుదల సందర్భంగా సాయి దుర్గా తేజ్ మాట్లాడుతూ, మన కల్చర్ మరియు నేచర్‌ను మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ డాక్యుమెంటరీ చూస్తే “మన చుట్టూనే ఇన్ని అద్భుతాలు ఉన్నాయా?” అని అనిపించక మానదని అన్నారు. 2020లో తాను ప్రారంభించిన ‘గ్రీన్ పాస్’ అనే ఎన్జీవో ద్వారా కోస్టల్ ఏరియాలోని జీవుల్ని, పక్షుల్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌కు మణిశర్మ మద్దతు ఇవ్వడం ఆనందంగా ఉందని, మీడియా మరియు ప్రేక్షకులు దీనికి సపోర్ట్ చేయాలని తేజ్ కోరారు.
దర్శకుడు శ్రీకాంత్ మన్నెపురికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడించి కావాల్సిన సహాయ సహకారాలన్నీ అందేలా చేశానని నవదీప్ తెలిపారు. ఈ డాక్యుమెంటరీ 72 నిమిషాల రన్ టైంతో రూపొందుతోందని, “మన రాష్ట్రంలో ఇన్ని అద్భుతాలు ఉన్నాయా?” అని డాక్యుమెంటరీ చూసిన తర్వాత అందరూ ఆశ్చర్యపోతారని నవదీప్ పేర్కొన్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో వాలంటీర్‌గా పనిచేసిన తర్వాతే మన ఆంధ్రలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయని తనకు తెలిసిందని దర్శకుడు శ్రీకాంత్ మన్నెపురి వివరించారు.








