మెగా కోడలు ఉపాసన కొణిదెల ఇటీవల ఐఐటీ హైదరాబాద్ సదస్సులో చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. పెళ్లి, మాతృత్వాన్ని ప్లాన్ చేసుకోవడం గురించి ఆమె చెప్పిన అభిప్రాయాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జోహో సీఈఓ శ్రీధర్ వెంబుతో సహా పలువురు ప్రముఖులు ఆమె కామెంట్స్‌పై స్పందించారు. ఈ నేపథ్యంలో, తన వ్యక్తిగత అనుభవాలను పంచుకుంటూ ఉపాసన సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు. మహిళలు కెరీర్, కుటుంబం రెండింటినీ సమతుల్యం చేసుకోవచ్చని, పిల్లల్ని ఎప్పుడు కనాలనేది వారి వ్యక్తిగత నిర్ణయమేనని ఆమె స్పష్టం చేశారు.
ఉపాసన తన పోస్ట్‌లో ‘ఫ్యాక్ట్ చెక్’ పేరిట తన జీవిత ప్రణాళికలను వివరించారు. 27 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకున్నానని, 29 ఏళ్ల వయసులో ఎగ్స్‌ను ఫ్రీజ్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. 36వ ఏట మొదటి బిడ్డకు జన్మనిచ్చినట్లు, ఇప్పుడు 39 సంవత్సరాల వయసులో కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్లు ఆమె వెల్లడించారు. తన ప్రయాణంలో వైవాహిక జీవితానికి ఎంత ప్రాధాన్యమిచ్చానో, కెరీర్ నిర్మాణానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇచ్చానని పేర్కొన్నారు.
“పెళ్లి, కెరీర్ ఒకదానితో మరొకటి పోటీ కాదు. అవి సంతృప్తికరమైన జీవితంలో సమానంగా అర్థవంతమైన భాగాలు. కానీ ప్రతి దానికీ ప్రత్యేక సమయం ఉంటుందని భావిస్తున్నాను. అది నా హక్కు” అని ఉపాసన పేర్కొన్నారు. సమాజపు ఒత్తిడికి లొంగకుండా ప్రేమ వివాహం చేసుకోవడం, సరైన భాగస్వామి దొరికే వరకు వేచి చూడడం, పరిస్థితులకు అనుగుణంగా పిల్లలను కనే సమయాన్ని నిర్ణయించుకోవడం తప్పు కాదని ఆమె ప్రశ్నించారు. ఈ చర్చ మరింత మంది మహిళలను శ్రామిక శక్తిలోకి తీసుకురావడానికి కలిసి పనిచేయడానికి సహాయపడుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.









