ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు రావడంతో నిర్మల్ జిల్లా దిలావర్పూర్లో ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇథనాల్ పరిశ్రమ అనుమతులు, షరతులు, స్థానికుల ఆందోళనపై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి నివేదిక అందించారు.
ఈ నేపథ్యంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులను పునః సమీక్షించాలని సర్కారు నిర్ణయించింది. ప్రజల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకొని స్థానికంగా ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
అంతేగాక, అవసరమైతే పరిశ్రమ అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అయితే, ప్రస్తుతానికి మాత్రం ప్రభుత్వ సూచనల మేరకు ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు, ప్రభుత్వ నిర్ణయం రావడానికి ముందు బుధవారంనాడు ఇథనాల్ పరిశ్రమను వ్యతిరేకిస్తూ గ్రామస్థులు, స్థానికులు భారీ ఎత్తున ఆందోళనలు చేపట్టారు. ఆందోళనకారులు పోలీసులపై దాడి చేయగా వారు పరుగులు తీశారు. ఈ ఆందోళనలో మహిళలు పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసనలు తెలిపారు. ఇథనాల్పరిశ్రమను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
లేదంటే.. తమ ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. నవంబర్ 26న కూడా జాతీయ రహదారిపై రాస్తారోకో చేయగా అక్కడికి వచ్చిన ఆర్డీవోను అడ్డుకుని కారు దహనానికి యత్నించారు. దీంతో కొద్దిసేపటి వరకు అక్కడ ఉద్రిక్తతకు దారితీసింది.
ఈ నేపథ్యంలో గ్రామస్థుల ఆందోళనలపై స్పందించిన కలెక్టర్ సీఎం కార్యాలయం(సీఎంవో)కు నివేదిక పంపినట్లు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దీంతో ఆందోళనకారులు తమ నిరసన విరమించి ఘటనా స్థలం నుంచి వెళ్లిపోయారు. అనంతరం పోలీసులు జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. తాజాగా, పరిశ్రమ నిలుపుదలకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.









