ఆంధ్రప్రదేశ్ షార్ట్ ఫిల్మ్ (AP Short Film) ఫెస్టివల్ 2026 పోస్టర్‌ను కన్వీనర్, సినీ దర్శకుడు దిలీప్ రాజా సోమవారం గుంటూరులో ఆవిష్కరించారు. ఎలాంటి ఎంట్రీ ఫీజు లేకుండా, ‘మా ఏపి’ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ ఫెస్టివల్‌ను 2026 జనవరి 4న తెనాలిలో నిర్వహించనుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఔత్సాహిక కళాకారులను ప్రోత్సహించడమే ఈ పోటీల ప్రధాన లక్ష్యమని దిలీప్ రాజా తెలిపారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ఎంట్రీలకు ఇందులో ప్రవేశం లేదని ఆయన స్పష్టం చేశారు.
షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలను పంపేవారికి కొన్ని ముఖ్య నిబంధనలను నిర్వాహకులు సూచించారు. షార్ట్ ఫిల్మ్ నిడివి 15 నిమిషాలకు మించకూడదు. అలాగే, డిసెంబర్ 25 లోగా ఎంట్రీలను “మా ఏపీ కార్యాలయం, ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలి 522 202” చిరునామాకు పంపాలి. కథాంశాలలో ఏ మతాన్ని, కులాన్ని, రాజకీయ పార్టీలను విమర్శించకుండా కంటెంట్ ఉండాలని దిలీప్ రాజా వివరించారు. దేశ భద్రతకు సవాళ్లుగా నిలిచిన శక్తులు, సమాజంపై విషం చిమ్ముతున్న వ్యవస్థలపై దృష్టి సారించవచ్చని, అయితే కథాంశాల ఎంపికలో పూర్తి స్వేచ్ఛ దర్శక నిర్మాతలకు ఉంటుందని ఆయన తెలిపారు.
విజేతలకు నగదు బహుమతులు మరియు స్మారక షీల్డ్‌లు అందించనున్నారు. సూపర్ స్టార్ కృష్ణ స్మారక ప్రధమ బహుమతిగా రూ. 50 వేలు, మహానటి సావిత్రి స్మారక ద్వితీయ బహుమతికి రూ. 30 వేలు, కొంగర జగ్గయ్య స్మారక తృతీయ బహుమతికి రూ. 20 వేలు అందజేస్తారు. వీటితో పాటు, గుమ్మడి వెంకటేశ్వరరావు, జమునల పేరుతో రెండు కన్సోలేషన్ బహుమతులకు రూ. 20 వేల చొప్పున నగదు బహుమతులు ఇవ్వనున్నారు. తెనాలిలో షూటింగ్ చేసుకునే యూనిట్లకు లొకేషన్లు, ట్రాక్ ట్రాలీ, లైట్లు వంటి పరికరాలను ‘మా ఏపి’ ఉచితంగా అందిస్తుందని కో కన్వీనర్ అచ్చన శ్రీనివాస యాదవ్ పేర్కొన్నారు.








