సీనియర్ నటుడు శివాజీ రాజా అరుణాచలంలో కొందరు భక్తుల ప్రవర్తనపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కొంతమంది భక్తితో కాకుండా, ఫొటోలు, వీడియోలు, వ్లాగ్స్ అంటూ అక్కడి ప్రశాంత వాతావరణాన్ని, స్థల పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత 30 ఏళ్లుగా తాను అరుణాచలాన్ని సందర్శిస్తున్నానని, మొదట్లో నిరాడంబరంగా దండం పెట్టుకుని వచ్చేవారిమని, కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయిందని శివాజీ రాజా తెలిపారు.
ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనాల తర్వాత తెలుగు భక్తుల రద్దీ పెరిగిందని శివాజీ రాజా అన్నారు. అయితే, వీరిలో 75 శాతం మంది భక్తితో వస్తున్నప్పటికీ, మిగతా 25 శాతం మంది మాత్రం అరుణాచలాన్ని ఒక వెకేషన్ ట్రిప్‌లా భావిస్తున్నారని ఆయన మండిపడ్డారు. వారు ఎక్కడ అడుగుపెడితే అక్కడ నాశనమే అని ఆరోపిస్తూ, సెల్ఫీల కోసం వెంకటేశ్, ఇళయరాజా వంటి ప్రముఖులు కూడా ప్రశాంతంగా ఉండే రమణాశ్రమం వంటి ప్రదేశాలలో అల్లరి చేస్తున్నారని గుర్తుచేశారు.
ఒకసారి నటుడు రాజా రవీంద్రతో కలిసి వెళ్లినప్పుడు కొంతమంది గట్టిగా అరుస్తుంటే, అక్కడున్న విదేశీయులు వచ్చి నిశ్శబ్దంగా ఉండాలని హెచ్చరించారని శివాజీ రాజా వివరించారు. కొందరి ప్రవర్తన అక్కడి పవిత్రతను దెబ్బతీయడం చూసి మనసుకు చాలా బాధ కలిగిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతుండగా, చాలా మంది నెటిజన్లు శివాజీ రాజా అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు.









