కేరళలోని వయనాడ్ స్థానానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈ మేరకు వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఇప్పటికే ఖరారైన ప్రియాంక గాంధీ, ఈనెల 23న నామినేషన్ ను దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, సోనియా గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేత వయనాడ్ మాజీ ఎంపీ, ప్రస్తుత రాయబరేలీ ఎంపీ రాహుల్ గాంధీ సైతం హాజరుకానున్నారు. వేలాది మంది కాంగ్రెస్ శ్రేణులతో భారీ ర్యాలీగా తరలివెళ్లి ప్రియాంక గాంధీ నామినేషన్ వేయనున్నారు.
ఓవైపు ఝార్ఖండ్ అసెంబ్లీకి తొలి దశ పోలింగ్, మరోవైపు వయనాడ్ పార్లమెంట్ స్థానంతో పాటు 47 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 13న దేశవ్యాప్తంగా బైపోల్స్ జరగనున్నాయి. ఈ మేరకు నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి.
గత సార్వత్రిక ఎన్నికల్లో వయనాడ్ సహా ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు చోట్ల విజయం సాధించారు. దీంతో తరతరాలుగా గాంధీ కంచుకోటగా నిలుస్తూ వస్తున్న రాయ్‌బరేలీకి ఎంపీగా కొనసాగేందుకే రాహుల్ మొగ్గుచూపించారు. ఫలితంగా వయనాడ్ ఎంపీగా రాజీనామా సమర్పించారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక ఏర్పడింది.









