ఏపీ రాజధాని అమరావతి పై కీలక అప్డేట్ వచ్చింది. అమరావతి నిర్మాణం కోసం ప్రపంచ బ్యాంకు నుంచి రూ 15 వేల కోట్ల రుణం మంజూరైంది. ఈ నిధుల వినియోగం పైన ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సీఆర్డీఏకు ఈ మేరకు అధికారం కల్పిస్తూ విధి విధానాలు ఖరారు చేసింది. అమరావతి అభివృద్ధి ప్రణాళిక అమలుచేయాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.
ప్రపంచ బ్యాంకు రుణం
అమరావతి కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ సంయుక్తంగా 15 వేల కోట్ల రుణం సీఆర్డీఏకు అందనుంది. ఈ నిధుల వినియోగం పై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో అత్యున్నత ప్రమాణాలతో మౌలిక వసతులు, హరిత నిర్మాణాలు, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండేలా కార్యాచరణ చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. అమరావతి అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికలు అమలు చేయాలని సీఆర్డిఏకు ప్రభుత్వం సూచించింది. రాజధాని ప్రాంతంలో ప్రజా జీవనానికి అవసరమైన ప్రధాన రహదారులు, డక్ట్ లు, డ్రెయిన్ లు, వరద నీటి ప్రవాహానికి అనుగుణంగా కాలువలు, నీటి రిజర్వాయర్లు, సురక్షిత తాగునీరు లాంటి సదుపాయాలకు సంబధించిన ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం సీఆర్డీఏకు స్పష్టం చేసింది.
సీఆర్డీఏ ప్రతిపాదనలు
రాజధాని అభివృద్ధికి ఏపీ సీఆర్డీఏ సమర్పించిన ప్రతిపాదనలు ఇచ్చారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ ఆమోదించిందని ప్రకటించారు. ఈ ప్రతిపాదనలకు ఆమోదం తెలుపుతూ ప్రపంచ బ్యాంకు, ఏడీబీ చెరో 800 మిలియన్ డాలర్ల మేర ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చాయి. అవసరమైన మిగతా నిధులను కేంద్రం సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకుంటుందని ఉత్తర్వుల్లో వివరించారు. ఈ మేరకు ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం పొందేందుకు ఏపీ సీఆర్డీఏ కు అధికారం కల్పిస్తూ ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
రుణ ఒప్పందం
అమరావతి అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికల ఆధారంగా దశల వారీగా బ్యాంకుల నుంచి నిధులు పొందేందుకు ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సూచించింది. రాజధాని అమరావతి నిర్మాణ ప్రణాళికల కోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపుల పైనా ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. సీఆర్డీఏ కమిషనర్ అధీనంలోనే ఈ అభివృద్ధి, నిర్మాణ ప్రణాళికలు అమలు చేయనున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. సోమవారం, మంగళవారం దిల్లీలో ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకుల నుంచి రుణ సహకారంపై సీఆర్డీఏ కమిషనర్ కాటంనేని భాస్కర్ ఒప్పందం చేసుకొనే వేళ ప్రభుత్వం ఈ నిధుల వినియోగం పైన స్పష్టత ఇస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.








