భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన, బాలీవుడ్ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్‌ల వివాహం అర్ధాంతరంగా వాయిదా పడటంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరిగింది. పెళ్లి ఆగిపోవడానికి ఇరు కుటుంబాల మధ్య విభేదాలు కారణమంటూ రకరకాల వదంతులు వ్యాపించాయి. ఈ నేపథ్యంలో, పలాష్ తల్లి అమితా ముచ్చల్ స్పందించి, అసలు విషయం వెల్లడించారు. వివాహం వాయిదా పడటానికి కారణం స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అస్వస్థతకు గురి కావడమేనని ఆమె స్పష్టం చేశారు.
అమితా ముచ్చల్ వదంతులను కొట్టి పారేస్తూ, “స్మృతి కంటే ఆమె తండ్రితోనే పలాష్ (Palash Muchhal) కు ఎక్కువ అనుబంధం ఉంది. ఆయన అనారోగ్యం గురించి తెలియగానే వివాహం వాయిదా వేయాలని నిర్ణయించుకున్నది స్మృతి కాదు, పలాషే. మామగారు కోలుకున్నాకే వివాహం చేసుకోవాలని తనే పట్టుబట్టాడు,” అని వెల్లడించారు. శ్రీనివాస్ మంధాన గుండెపోటు లక్షణాలతో సాంగ్లీలోని ఆసుపత్రిలో చేరారు. తండ్రి లేకుండా వివాహం వద్దని స్మృతి నిర్ణయించుకున్నట్లు ఆమె మేనేజర్ అంతకుముందు తెలిపారు.
పలాష్ ముచ్చల్ కూడా అనారోగ్యంతో సాంగ్లీ ఆసుపత్రిలో చేరి, తరువాత ముంబైకి తరలించబడ్డారు. వరుస మ్యూజిక్ కచేరీలు, వివాహ పనుల ఒత్తిడి వల్లే అతడి ఆరోగ్యం దెబ్బతిన్నదని సన్నిహితులు పేర్కొన్నారు. దీనిపై అమిత మాట్లాడుతూ, “స్మృతి తండ్రికి ఛాతీ నొప్పి అని తెలియగానే పలాష్ చాలాసేపు ఏడ్చాడు. ఆ ఒత్తిడితోనే అతడి ఆరోగ్యం కూడా దెబ్బతిన్నది. ఆసుపత్రిలో అతడికి ఐవీ డ్రిప్ పెట్టి, ఇతర పరీక్షలు చేశారు. రిపోర్టులు సాధారణంగానే ఉన్నా, ఇంకా ఒత్తిడి నుంచి బయటపడలేదు,” అని వివరించారు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబ గోప్యతను గౌరవించాలని పలాష్ సోదరి, గాయని పాలక్ ముచ్చల్ కోరారు.








