అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ముఖ్యంగా తన కెరీర్లో మైలురాయిగా నిలిచే 100వ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ చిత్ర షూటింగ్ పనులు వేగంగా జరుగుతుండగా, నాగార్జున ఎంతో సైలెంట్‌గా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇప్పటివరకు సినిమా గురించి ఎలాంటి అధికారిక సమాచారం బయటకు రాకపోవడంతో, సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
ముగ్గురు హీరోయిన్లు రంగంలోకి..?
ఈ సినిమాకు ‘లాటరీ కింగ్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అలాగే హీరోయిన్ల విషయంలో రోజుకో కొత్త వార్త వినిపిస్తోంది. మొదట నయనతార, అనుష్క పేర్లు వినిపించినప్పటికీ, ఆ వార్తల్లో నిజం లేదని సమాచారం. తాజాగా ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లు నటించబోతున్నారనే టాక్ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే సీనియర్ నటి టబు ఈ సినిమాలో భాగమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
నాగ్ సరసన కొత్త జోడీలు
టబుతో పాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ సినిమాలో కనిపించబోతున్నారట. అందులో నటి ఐశ్వర్య రాజేష్ పేరు బలంగా వినిపిస్తోంది. అలాగే సుస్మిత భట్ కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. ఇలా ఈ ముగ్గురు నటీమణులు నాగార్జునతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
సంక్రాంతి టార్గెట్‌తో భారీ ప్లాన్
నాగార్జున 100వ సినిమా కావడంతో, ఈ ప్రాజెక్ట్‌ను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో ‘సోగ్గాడే చిన్నినాయన’ పార్ట్ 3తో కూడా నాగార్జున ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రం 2027 సంక్రాంతి సందర్భంగా విడుదల కానుందని ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు, నాగార్జున బిగ్ బాస్ షోకు హోస్ట్‌గా కూడా కొనసాగనున్నారు.








