ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసిపి అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిలకు మధ్య తండ్రి రాజశేఖర్ రెడ్డి ఆస్తుల విషయంలో ప్రచ్చన్న యుద్ధం కొనసాగుతుంది .సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ఆస్తుల విషయంలో సోదరుడు జగన్ తీరుపైన వైయస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ అన్యాయం చేశాడన్న షర్మిల
తన తండ్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నలుగురు మనవళ్లు మనవరాళ్లకు ఆస్తి సమానంగా పెంచాలని ఆదేశిస్తే, ఆ ఆదేశాలు గాలికి వదిలేసి జగన్ తమకు అన్యాయం చేశాడని వాపోయారు. తనకు తన పిల్లలకు జగన్ అన్యాయం చేశారంటూ కన్నీటి పర్యంతమైన షర్మిల, జగన్ ధనదాహంతో కుటుంబ పరువును రోడ్డు మీదకి ఈడ్చాడు అని, మన మీద, తన తల్లి మీద కేసులు పెట్టాడని, అధః పాతాళానికి కూరుకుపోయాడని కన్నీటి పర్యంతమయ్యారు.
ఇక తాజాగా షర్మిల జగన్ పైన చేసిన వ్యాఖ్యలతో గుడివాడ అమర్నాథ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైయస్ షర్మిల చంద్రబాబు మోచేతి నీళ్లు తాగుతున్నారని అందుకే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని ఆయన ఆరోపించారు. షర్మిల చేసే ఆరోపణలు ఖండించిన వారంతా మోచేతి నీళ్లు తాగినట్టు కనిపిస్తే అది మీ అమాయకత్వం అంటూ మండిపడ్డారు.
షర్మిల తన పతనం తానే కోరుకుంటున్నారు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అటువంటి లక్షణాలు లేవని, మేము నిజాలను ప్రజల ముందు పెడుతుంటే ఎందుకు మీరు ఉలిక్కిపడుతున్నారు అంటూ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. వైయస్ షర్మిల తన పతనాన్ని తానే కోరుకుంటున్నారని, ఎందుకు ఈ స్థాయికి దిగజారి పోయారో అర్థం కావడం లేదని గుడివాడ అమర్నాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
సొంత అన్నను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఊరుకోం
చంద్రబాబు చేతిలో కీలుబొమ్మగా మారిన షర్మిల చంద్రబాబు కోసమే ఈ విధంగా సొంత అన్న పైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ముందు షర్మిల ysrcp నాయకులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, సొంత అన్నను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చూస్తూ ఊరుకోబోరని ఆయన తేల్చి చెప్పారు.
వైసీపీ కార్యకర్త కూడా ఆ పరిస్థితిలో లేరు
వైయస్ జగన్ దమ్ము, ధైర్యం చూసి ఆయన వెంట ఉన్న నాయకులే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారన్నారు . చంద్రబాబు మోచేతి నీళ్ళు షర్మిలమ్మ తాగుతున్నారని, వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకులే కాదు కార్యకర్త కూడా ఆ పరిస్థితిలో లేరని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు . వై వి సుబ్బారెడ్డి పై కనీస గౌరవం లేకుండా షర్మిల మాట్లాడుతున్నారని గుడివాడ అమర్నాథ్ ఫైర్ అయ్యారు.
వైసీపీని బలహీన పరచాలన్న ఆలోచనతో షర్మిల వ్యాఖ్యలు
జగన్ పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి షర్మిలకు నోరెలా వచ్చిందని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జిషీట్లో పెట్టిన కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరారని మండిపడ్డారు. వైసీపీని బలహీన పరచాలన్న ఆలోచనతో షర్మిల ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.









